India-US: భారత్‌కు ఎఫ్-35 జెట్‌లు.. మోదీతో భేటీ తర్వాత ట్రంప్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
సరిహద్దుల్లో చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శక్తిని మరింత పెంచే కీలక ప్రకటన వెలువడింది.
న్యూఢిల్లీకి ఆధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో వాణిజ్యం, దౌత్య సంబంధాలు, రక్షణ రంగ సహకారం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అనంతరం వారు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
వివరాలు
అమెరికా-భారత్ మధ్య కీలక ఒప్పందాలు
ట్రంప్ మాట్లాడుతూ, ''భారత్‌తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. భారత్, అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచుతుంది. మిలిటరీ ఉత్పత్తుల సరఫరాను మరింతగా విస్తరిస్తాం. అంతేకాకుండా, ఆధునిక ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.
వివరాలు
భారత్-అమెరికా వ్యాపార సంబంధాలు
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ''భారత్-అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం త్వరలో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. చమురు, గ్యాస్ వాణిజ్యంపైనా మరింత దృష్టి సారిస్తాం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడం మా లక్ష్యం'' అని తెలిపారు.
యుద్ధంపై భారత్ వైఖరి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ స్పందిస్తూ, ''యుద్ధంపై భారత్ తటస్థంగా ఉండదు. మేం శాంతిని ప్రోత్సహిస్తాం. ఇది యుద్ధాల శకం కాదని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పాను. ఈ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతున్నాను'' అని పేర్కొన్నారు.