LOADING...
Trump: భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి
భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి

Trump: భారత్‌పై ఆంక్షలు కఠినం చేయాలని యూరోపియన్ దేశాలకు అమెరికా విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా విధించిన ఆంక్షలతో సమానంగా భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా యూరప్ భారత్ నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తక్షణమే నిలిపివేయాలనే డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆగస్టు 27 నుంచి అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే ఈ సుంకాల విషయంలో ఇప్పటివరకు ఏ యూరోపియన్ నాయకుడు బహిరంగ ప్రకటన చేయలేదు. ట్రంప్ ప్రభుత్వం విధించిన 50% సుంకాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Details

ఇంధన ఉత్పత్తులు కొనుగోలు

రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశం చైనా కాగా యూరప్ కూడా మాస్కో నుంచి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ, ఈ రెండు దేశాలు భారతదేశంలా సుంకాల భారం ఎప్పుడూ ఎదుర్కోలేదని భారత్ పాశ్చాత్య దేశాలను తీవ్రంగా విమర్శించింది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్ మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తోంది, తద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కొంతమంది యూరోపియన్ నాయకులు బహిరంగంగా మద్దతు ఇస్తున్నప్పటికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-పుతిన్ మధ్య వచ్చిన పురోగతిని వెనక్కు నెట్టే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నాయని వైట్ హౌస్ సీనియర్ అధికారులు భావిస్తున్నారని సమాచారం.

Details

రాబోయే రెండ్రోజుల్లో  టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ 

ఇదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యాకు ఎటువంటి రాయితీలు ఇవ్వొద్దని యూరోపియన్ నాయకులకు సూచిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ విధానం యుద్ధాన్ని మరింతగా రగిలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు రాబోయే రెండు రోజుల్లో టియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో భారత్‌పై అమెరికా సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రధాన చర్చా అంశాలుగా నిలిచే అవకాశముంది.