USAID: హమాస్,లష్కరే గ్రూప్‌లకు యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు..!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందించే యూఎస్ ఎయిడ్ (USAID) లో భారీగా వృథా ఖర్చులు జరుగుతున్నాయని,పైగా అది నేరగాళ్ల సంస్థగా మారిపోయిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk),అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వేలాది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులను ట్రంప్ తొలగించారు.
తాజాగా,యూఎస్ ఎయిడ్ ఫెడరల్ ఉద్యోగులపై హౌస్ కమిటీ విచారణ సందర్భంగా సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
2023 అక్టోబర్ 7న హమాస్ (Hamas)ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థకు యూఎస్ ఎయిడ్ ద్వారా దాదాపు 2బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
లష్కరే తోయిబాకి యూఎస్ ఎయిడ్ నిధులు
ఈ నిధులు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పాలనలో మంజూరైనట్లు నివేదికలు స్పష్టం చేశాయి.
అంతేకాకుండా, యూఎస్ ఎయిడ్ నుంచి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే, ఉగ్రవాద సంబంధిత సంస్థగా అమెరికా ముద్ర వేసిన ఫలా ఎ ఇన్సానియత్ ఫౌండేషన్ (FIF) కు సైతం నిధులు అందినట్లు వెల్లడించారు.
ఈ సంస్థ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కోసం పనిచేసే భాగంగా ఉందని తెలుస్తోంది.
లష్కరే తోయిబా భారత్‌పై 26/11 ముంబయి ఉగ్రదాడులను సహా పలు ఉగ్రదాడులకు బాధ్యత వహించిన విషయం తెలిసిందే.
అమెరికా ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించినప్పటికీ, యూఎస్ ఎయిడ్ ద్వారా వీటికి నిధులు అందించడం గమనార్హం.
వివరాలు
ఎలాన్ మస్క్ కి మద్దతుగా ట్రంప్
యూఎస్ ఎయిడ్‌కు మిషిగాన్‌లోని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్ (HHRD) తో సంబంధాలు ఉన్నాయని, దీని ద్వారా ఉగ్రవాద సంస్థ అయిన ఎఫ్ఐఎఫ్‌తో పాటు మరికొన్ని జిహాదీ సంస్థలకు నిధులు మంజూరు చేసినట్లు మిడిల్ ఈస్ట్ నిపుణుడు అమ్జద్ తాహా వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి రాగానే, ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు.
ఆయనకు మద్దతుగా, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ (DOGE) సంస్థ అనేక మంది ఉద్యోగులను తొలగించింది.
మస్క్ యూఎస్ ఎయిడ్ ద్వారా అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయని ఆరోపించగా, ట్రంప్ కూడా దీనిని సమర్థించారు.
ప్రపంచదేశాలకు అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.