భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం
సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నుంచి నీటి మూలాలు ఉన్నట్లు అమెరికాలోని నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి నుంచి 1300కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'వీ883 ఓరియోనిస్' నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక కొత్త గ్రహంపై వాయు నీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి ఆనవాళ్లను గుర్తించడం వల్ల భూమిపై సూర్యుడి పుట్టుకకు ముందే నీరు ఆవిర్భవిచి ఉండొచ్చని అంచనా వేశారు. అటాకామా లార్జ్ మిల్లీమీటర్ అనే అధునాతన టెలిస్కోప్ సాయంతో కొత్త గ్రహంపై పరిశోధనలు చేసినట్లు వెల్లడించారు. వీ883 ఓరియోనిస్ నక్షత్రం చుట్టూ ఉన్న గ్రహంపై ఏర్పడే డిస్క్‌లోని నీటి కూర్పును అధ్యయనం చేయడం ద్వారా ఈ ఆవిష్కరణ జరిగిందని వెల్లడించారు.
వీ883 ఓరియోనిస్ నక్షత్రంపై విస్తృత పరిశోధనలు
వాయువు- ధూళి మేఘం కూలిపోయినప్పుడు దాని మధ్యలో ఒక నక్షత్రం ఏర్పడుతుంది. మేఘంలోని పదార్థం నక్షత్రం చుట్టూ డిస్క్‌ను ఏర్పరుస్తుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత డిస్క్‌లోని పదార్థం నుంచి తోకచుక్కలు, గ్రహశకలాలు, చివరికి గ్రహాలను ఏర్పడుతాయి. వాయువు- ధూళి మేఘం నుంచి నక్షత్రాలకు అక్కడి నుంచి తోక చుక్కలకు, వాటి నుంచి గ్రహాలకు వివిధ రూపాల్లో నీరు చేరుతున్న తీరును వీ883 ఓరియోనిస్ నక్షత్రంపై విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా ద్వారా తెలుసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఆధారంగానే భూమిపై సూర్యుడి కంటే ముందే నీటి ఆవిర్భావం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.