LOADING...
Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

Pakistan: పాకిస్థాన్ అణ్వాయుధ సామర్థ్యం ఎంత? దాని అణ్వాయుధాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్ మార్షల్‌ అసిమ్ మునీర్‌ ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. "తాము నాశనమైతే.. తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకెళ్తామంటూ మునీర్‌ పిచ్చి ప్రేలాపనలు చేశారు. అంతేకాక, పహల్గామ్‌ దాడి తర్వాత భారత్‌ 'ఇండస్‌ వాటర్స్‌ ట్రీటీ'ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయంపై స్పందిస్తూ... "భారత్‌ డ్యామ్‌ కడితే, దాన్ని 10 క్షిపణులతో ధ్వంసం చేస్తాం" అని హెచ్చరించారు. పాకిస్తాన్‌ ఇంతకుముందు కూడా అణ్వస్త్ర బెదిరింపులు చేసినప్పటికీ... అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వివరాలు 

అమెరికా పర్యటనలో మునీర్‌ అణ్వస్త్ర వ్యాఖ్యలు 

అసీం మునీర్‌ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఫ్లోరిడా టాంపాలో పాక్‌ హానరరీ కాన్సుల్‌ అద్నాన్‌ అసాద్‌ ఆతిథ్యమిచ్చిన విందులో మాట్లాడుతూ... భారత్‌తో భవిష్యత్తులో యుద్ధంలో పాకిస్తాన్‌ ఉనికికి ముప్పు వాటిల్లితే అణ్వస్త్రాలతోనే ప్రతిస్పందిస్తామని ప్రకటించారు. ఇండస్‌ నదిపై భారత్‌ నిర్మించే ఏదైనా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇండస్‌ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల 25 కోట్ల మంది ఆకలికి గురయ్యే ప్రమాదముందని చెప్పారు. "భారతదేశం డ్యామ్‌ కడితే... దాన్ని 10 క్షిపణులతో మట్టుబెట్టేస్తాం. ఇండస్‌ నది వాళ్ల ఇంటి సొత్తు కాదు. మా వద్ద క్షిపణుల కొరత లేదు" అని మునీర్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

అమెరికా రక్షణ కార్యక్రమాలకు హాజరు 

సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) మాజీ కమాండర్‌ మైకేల్‌ కురిల్లా రిటైర్మెంట్‌ కార్యక్రమం, కొత్త కమాండర్‌ బ్రాడ్‌ కూపర్‌ బాధ్యతల స్వీకరణ వేడుకలకు హాజరయ్యారు. కురిల్లా నాయకత్వాన్ని ప్రశంసించిన ఆయన, కూపర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గత జూన్‌లో మునీర్‌ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అమెరికా-పాక్‌ మధ్య చమురు ఒప్పందం సహా పలు సహకారాలు ప్రకటించారు.

వివరాలు 

పాకిస్తాన్‌ అణ్వస్త్ర సామర్థ్యం 

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (SIPRI) తాజా అంచనాల ప్రకారం పాకిస్తాన్‌ వద్ద సుమారు 170 అణ్వస్త్ర వార్‌హెడ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ వద్ద 180 ఉన్నట్లు జనవరి 2025 గణాంకాలు చెబుతున్నాయి. 2023లో 'బులెటిన్‌ ఆఫ్‌ ది అటామిక్‌ సైంటిస్ట్స్‌'నివేదిక ప్రకారం పాక్‌ వద్ద కొత్త డెలివరీ సిస్టమ్స్‌, ప్లుటోనియం రియాక్టర్లు,యురేనియం సదుపాయాలు ఉండటంతో అణ్వస్త్ర భాండాగారాన్ని వేగంగా పెంచే శక్తి ఉంది. అమెరికా నిపుణుల ప్రకారం.. పాక్‌ అణ్వస్త్ర శక్తి ఎక్కువగా భూమి ఆధారిత క్షిపణులపైనే ఆధారపడి ఉంది. భూ,గగనం,సముద్ర మార్గాల్లో అణ్వస్త్ర దాడులు చేసే సామర్థ్యం సాధించే దిశగా కృషి చేస్తోంది.

వివరాలు 

పాక్‌ అణ్వస్త్ర నియంత్రణ ఎవరి చేతుల్లో? 

2023లో పాక్‌ అణ్వస్త్ర ప్రోగ్రాంకు 1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు 'ఇంటర్నేషనల్‌ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌' తెలిపింది. పాక్‌ క్షిపణి సాంకేతికతలో చైనాకు ఉన్న సహాయం కూడా కీలకం అయ్యింది. పాకిస్తాన్‌లో అణ్వస్త్రాల నియంత్రణ అధ్యక్షుడు, ప్రధాని ఆధ్వర్యంలోని నేషనల్‌ కమాండ్‌ అథారిటీ (NCA) చేతిలో ఉంటుంది. సిద్ధాంతపరంగా ఇది పౌర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పటికీ... యుద్ధ సమయంలో సైన్యం నిర్ణయాధికారం సాధించే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

పాక్‌ అణ్వస్త్ర నియంత్రణ ఎవరి చేతుల్లో? 

2011లో 'ఎన్‌బీసీ న్యూస్‌' వెల్లడించిన సమాచారం ప్రకారం... పాక్‌ అణ్వస్త్రాలు అమెరికాకు ముప్పు కలిగించే పరిస్థితి వస్తే 'స్నాచ్‌ అండ్‌ గ్రాబ్‌' ఆపరేషన్‌ ద్వారా స్వాధీనం చేసుకునే ప్రణాళిక ఉందట. 9/11 ఘటనకు ముందు నుంచే ఇది సిద్ధమైందని నివేదికలు చెబుతున్నాయి. ఒసామా బిన్‌ లాడెన్‌ ఆపరేషన్‌ తర్వాత ఈ ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ ప్రణాళిక అమలు చేస్తే పూర్తి స్థాయి యుద్ధమే జరుగుతుందని అప్పటి పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషర్రఫ్‌ హెచ్చరించారు.