US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. 14 అంశాలతో కూడిన ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని స్పష్టం చేయడంతో పాటు, ఆ దేశ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధికి 300 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇందులో అమెరికా నేరుగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వివరాలు
యుద్ధానికి శాశ్వత ముగింపు
ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, ఇరాన్‌తో పాటు వాటి మిత్రదేశాలు అన్ని ప్రాంతాల్లో సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా లెబనాన్‌లో ఎలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇకపై ఒకరిపై మరొకరు సైనిక చర్యలకు దిగకూడదని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అంగీకరించారు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండదు అమెరికా, ఇరాన్ పరస్పరం ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. పరస్పర భౌగోళిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని ప్రకటించారు.
వివరాలు
60 రోజుల్లో తుది ఒప్పందం
ఈ అవగాహన ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల్లో తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది. అమెరికా దిగ్బంధానికి ముగింపు ఇరాన్‌పై విధించిన సముద్ర దిగ్బంధాన్ని అమెరికా క్రమంగా ఎత్తివేయనుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై ఉన్న ఆంక్షలను 30 రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని తెలిపింది. అలాగే ఇరాన్ సమీప ప్రాంతాల్లో మోహరించిన అమెరికా సైన్యాన్ని కూడా వెనక్కి తరలించనుంది.
వివరాలు
హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనుంది
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము లేకుండా ప్రయాణించేందుకు ఇరాన్ చర్యలు తీసుకుంటుంది. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఒమన్‌తో పాటు గల్ఫ్ దేశాలతో కలిసి దీనిపై విస్తృత ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇరాన్ ఆర్థిక పునరుద్ధరణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రణాళికను రూపొందించాలని అమెరికా, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు నిర్ణయించాయి. అయితే ఈ నిధిలో అమెరికా ప్రత్యక్షంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
ఆర్థిక ఆంక్షలకు ముగింపు
ఇరాన్‌పై అమెరికా, ఐక్యరాజ్యసమితి విధించిన ఆర్థిక ఆంక్షలను క్రమంగా ఎత్తివేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన కాలపట్టికపై తుది ఒప్పందం సమయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అణ్వాయుధాలకు నో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని అంగీకరించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న అధిక సాంద్రత యురేనియాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో భద్రంగా నిర్వహించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుత పరిస్థితి యథాతథం తుది ఒప్పందం జరిగే వరకు ఇరాన్ అణు కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సమయంలో అమెరికా కొత్త ఆంక్షలు విధించకుండా, చమురు ఎగుమతులు, బ్యాంకింగ్ లావాదేవీలకు తాత్కాలిక మినహాయింపులు ఇవ్వనుంది.
వివరాలు
స్తంభింపజేసిన నిధుల విడుదల
ఇరాన్‌కు విదేశాల్లో నిలిపివేసిన నిధులను దశలవారీగా విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే ఇరాన్ ఒప్పంద నిబంధనలను పాటించిన మేరకే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పర్యవేక్షణ, తుది చర్చలు ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రెండు దేశాలు తుది ఒప్పందంపై చర్చలు ప్రారంభిస్తాయి. ఆ తుది ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానం ద్వారా చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.
వివరాలు
మొత్తంగా...
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు, హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, అణ్వాయుధాల నియంత్రణ, ఆర్థిక పునర్నిర్మాణం వంటి కీలక అంశాలను కలిగి ఉంది. అయితే వీటన్నింటి అమలు ఇరాన్ ఒప్పంద నిబంధనలను ఎంతవరకు పాటిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.