Page Loader
Tulsi Gabbard: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపిక.. ఎవరీ తులసీ గబ్బార్డ్‌.. 
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపిక.. ఎవరీ తులసీ గబ్బార్డ్‌..

Tulsi Gabbard: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపిక.. ఎవరీ తులసీ గబ్బార్డ్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి తోడ్పడిన వారికి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవులను కేటాయిస్తున్నారు. తాజాగా తులసీ గబ్బార్డ్‌ను నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలో నిబద్ధతతో పని చేస్తూ ఆమె తనదైన ముద్ర వేస్తారని, రాజ్యాంగ హక్కులను కాపాడుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. తులసీ గబ్బార్డ్‌ గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రతినిధిగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీచేశారు, అనంతరం జో బైడెన్‌కు మద్దతు తెలిపినప్పటికీ, తరువాత స్వతంత్ర అభ్యర్థిగా మారారు.

వివరాలు 

ఎఫీషియెన్సీ విభాగంలో వివేక్ రామస్వామి

ప్రభుత్వ వ్యూహాల్లో భాగంగా ట్రంప్‌ ప్రముఖ వ్యక్తులను వివిధ పదవులకు నియమిస్తున్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌, భారత సంతతి నాయకుడు వివేక్ రామస్వామిలను గవర్నమెంట్ ఎఫీషియెన్సీ విభాగంలో నాయకత్వంలో ఉంచగా, పీట్‌ హేగ్‌సేత్‌ను రక్షణమంత్రిగా, జాన్‌ రాట్‌క్లిఫ్‌ను సీఐఏ అధిపతిగా, మైక్‌ వాల్జ్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు.

వివరాలు 

ఎవరీ తులసి గబ్బర్డ్? 

తులసి గబ్బార్డ్ అమెరికన్ రాజకీయ నాయకురాలు, ఆమె సినిమాటోగ్రాఫర్ అయిన అబ్రహం విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు గూఢచార విభాగంలో అనుభవం లేకపోయినా, అమెరికా మిలిటరీలో రెండు దశాబ్దాలకుపైగా సేవలందించిన అనుభవం ఉంది. ఆమె గతంలో డెమోక్రటిక్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ, 2013 నుండి 2021 వరకు హవాయి రాష్ట్రానికి చెందిన రెండో జిల్లాకు కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె హౌస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో కూడా రెండు సంవత్సరాలపాటు సేవలందించారు. తులసి గబ్బార్డ్ పేరుతో చాలా మంది ఆమెను భారతీయురాలిగా భావిస్తారు, కానీ ఆమెకు భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లి హిందూ మతంలోకి మారి, తన పిల్లలందరికీ హిందూ పేర్లను పెట్టింది.

వివరాలు 

కమలా హారిస్‌కు వ్యతిరేకంగా నామినేషన్‌

తులసి గబ్బార్డ్‌ను మొదటి హిందూ అమెరికన్ కాంగ్రెస్ మహిళగా గుర్తించారు. ఆమె అమెరికన్ సమోవా సంతతికి చెందిన వ్యక్తి కాగా, కాంగ్రెస్ పదవికి భగవద్గీతపై ప్రమాణం చేశారు. 2020లో, ఆమె డెమోక్రటిక్ ప్రైమరీలో కమలా హారిస్‌కు వ్యతిరేకంగా నామినేషన్‌ను వేశారు, కానీ రేసు నుంచి తప్పుకున్నారు. 2022లో, తులసి డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆమె ట్రంప్ మద్దతుదారుగా ప్రసిద్ధి చెందారు. గత కొన్నేళ్లుగా ఆమె ట్రంప్‌తో స్నేహంగా ఉంటూ రిపబ్లికన్ పార్టీలో చేరారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని గబ్బార్డ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల సందర్భంలో, కమలా హారిస్‌పై ట్రంప్ డిబేట్లకు సిద్ధం కావడంలో తులసి కీలక పాత్ర పోషించారు.