Page Loader
WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో 
అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో

WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో కీలక పదవిలో ఉన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) తాత్కాలిక సెలవుపై వెళ్లారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆమెపై అవినీతి కేసులు నమోదు చేయడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సైమా వాజెద్ సెలవులో ఉన్నారని ఆ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు డబ్ల్యూహెచ్‌వో నిరాకరించింది. ఢిల్లీలో ఉన్న ఆగ్నేయ ఆసియా ప్రాంత కార్యాలయంలో సైమా వాజెద్ స్థానంలో తాత్కాలికంగా డాక్టర్ కేథరినా బోహ్మే బాధ్యతలు స్వీకరించనున్నారు.

వివరాలు 

ఆందోళనల సమయంలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు 

బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్‌..సైమాపై అధికార దుర్వినియోగం,మోసం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి అభియోగాలతో కేసులు నమోదు చేసింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పరిస్థితి కూడా వేగంగా మారుతోంది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆమె ప్రధాని పదవి నుంచి అనూహ్యంగా దిగిపోయి, గత ఏడాది ఆగస్టు 5న దేశాన్ని వదిలి భారత్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. ఆందోళనల సమయంలో ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ మద్దతుదారులైన హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై విస్తృతంగా దాడులు జరిగాయి. ఈ అల్లర్ల కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

వివరాలు 

కోర్టు ధిక్కరణ కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో కొత్తగా యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హసీనాపై హత్య సహా అనేక కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, కోర్టు ధిక్కరణ కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. ఈ శిక్ష అనంతరం ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే సైమా వాజెద్‌కు సంబంధించి ఈ షాక్‌ తగిలింది. సైమా వాజెద్ విషయంలో బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీఖుల్ అలామ్ స్పందించారు. డబ్ల్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.