LOADING...
Earthquake: జపాన్,రష్యా తీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7.. సునామీ హెచ్చరికలు 

Earthquake: జపాన్,రష్యా తీరంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7.. సునామీ హెచ్చరికలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించిందని అధికారిక సమాచారం. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 8.7గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. భూకంపం కారణంగా రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం పరిసర ప్రాంతాలతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌కు చెందిన నాలుగు ప్రధాన దీవులకు ఉత్తర దిశగా ఉన్న హక్కైడో ద్వీపానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప ప్రభావంతో రానున్న మూడుగంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాల్లో భారీ సునామీ అలలు దూసుకొచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) హెచ్చరించింది.

వివరాలు 

పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలో భవనాలు తీవ్రంగా కంపించాయి

అలాగే అలస్కా జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం,అలస్కాలోని అలూటియన్‌ దీవులలోని కొన్ని ప్రాంతాలను సునామీ ప్రభావం కమ్మేసే అవకాశం ఉంది. తీరప్రాంతాలతో పాటు, కాలిఫోర్నియా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌, హవాయి వంటి ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వరకూ ఈ భూకంపం వల్ల ప్రాణహాని, ఆస్తినష్టం గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. అయితే, భూకంపం సంభవించిన వేళ రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలో భవనాలు తీవ్రంగా కంపించాయని స్థానిక మీడియా నివేదించింది.

వివరాలు  

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారని కూడా సమాచారం. ఈ భూకంప ప్రభావంతో కమ్చట్కా ప్రాంతంలో విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకంపనల తీవ్రతను చూపిస్తూ కొన్ని వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలో కదులుతున్న భవనాలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సునామీ హెచ్చరికలు