Page Loader
USA: 'మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం': రష్యా సంబంధాలపై భారత్, చైనాకు అమెరికన్ సెనెటర్ వార్నింగ్..
'మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం': రష్యా సంబంధాలపై భారత్, చైనాకు అమెరికన్ సెనెటర్ వార్నింగ్..

USA: 'మీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం': రష్యా సంబంధాలపై భారత్, చైనాకు అమెరికన్ సెనెటర్ వార్నింగ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం,చైనాలను భయపెట్టేలా రష్యాతో భారత్ స్నేహాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికాలో ఉన్న కీలక నేతలు హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం నాటో చీఫ్ మాట్లాడుతూ... రష్యాతో మైత్రి కొనసాగించడం భారతదేశానికి నష్టకరమవుతుందంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. అదే నేపథ్యంలో తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో, భారత్ రష్యా చమురు కొనుగోళ్లను ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ట్రంప్ పరిపాలనలో చమురు దిగుమతులపై 100 శాతం సుంకాలను విధించేలా యోచన చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

వివరాలు 

రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ మూడు దేశాలు 80శాతం వాటా

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ లిండ్సే గ్రాహం గతంలో కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భారత్,చైనా సహా రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 500 శాతం సుంకాలు విధించాలని ప్రతిపాదించారు. రష్యా చౌక చమురును కొనుగోలు చేస్తూ యుద్ధాన్నిప్రోత్సహిస్తే, భారత్, చైనా, బ్రెజిల్‌ల వంటి దేశాలను ఆర్థికంగా ధ్వంసం చేస్తామని, వీరి ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ మూడు దేశాలు 80శాతం వాటా కలిగి ఉన్నాయని,వీరే పుతిన్ యుద్ధానికి నేరుగా సహాయపడుతున్నారని ఆరోపించారు. పుతిన్ రక్తపాతాన్ని ఆపేందుకు ఏ దేశం ముందుకు రాకపోతే, అతను ఆగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆ దేశాలపై ఆంక్షలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనపై ఉన్న ఆక్రమణ వాంఛను తీరుస్తూ, ఒకప్పుడు ఉన్న సోవియట్ యూనియన్‌ను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాడని కూడా లిండ్సే గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా గతంలో భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆ దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి భారత ప్రభుత్వం తక్షణమే తీవ్రంగా స్పందించింది. దేశ ప్రజలకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయడం తమ ప్రాధాన్యమని, వారి అవసరాలను తీర్చడం తమ బాధ్యత అని భారతదేశం స్పష్టం చేసింది.