India-Canada row: చట్టబద్ధ పాలన కోసం నిస్సందేహంగా నిలబడతాం: భారత్‌తో వివాదంపై ట్రూడో కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం కెనడా-భారత్ దౌత్య సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది. తాజాగా నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి స్పందించారు. తాను ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన కోసం నిలబడతానని అన్నారు. కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ట్రూడో మరోసారి తన ఆరోపణను పునరుద్ఘాటించారు. కెనడా ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన కోసం నిలబడే దేశమన్నారు. నిజ్జర్ హత్యపై విచారణ జరిపేందుకు అమెరికాతో సహా మిత్రదేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు.
వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించింది: ట్రూడో
40 మంది కెనడియన్ దౌత్యవేత్తలను భారత్ నిషేధించి వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రూడో ఆరోపించారు. ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. ఎందుకంటే ఒక దేశం మరొక దేశానికి చెందిన దౌత్యవేత్తలు ఇకపై సురక్షితంగా లేరని నిర్ణయించగలిగితే, అది అంతర్జాతీయ సంబంధాలను మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. తాము భారత్‌తో నిర్మాణాత్మకంగా కలిసి పనిచేయడానికి ప్రయత్నించామన్నారు. తాము భారత్‌పై పోరాటం చేయడం లేదని, కేవలం చట్టబద్ధమైన పాలన కోసం మాత్రమే పని చేస్తున్నట్లు మరోసారి వెల్లడించారు.