GST Meeting: డిసెంబర్ 21న నుండి 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న ఢిల్లీలో జరగనుంది. ఈ భేటీలో 2025-26 బడ్జెట్ పై చర్చలు జరగనున్నాయి. అందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చే సిఫార్సులను ఆర్థికమంత్రిశాఖ స్వీకరించనుంది. తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర బడ్జెట్ 2025లో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో ఏపీకి భారీ ఆర్థిక సహాయం ప్రకటించిన కేంద్రం, ఈ సారి కూడా ఆర్థిక మద్దతు అందించే అవకాశాలు ఉన్నాయి.
సమావేశంలో బడ్జెట్‌తో పాటు ఇతర కీలక అంశాలపై చర్చలు
ప్రస్తుతం, ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌తో పాటు ఇతర కీలక అంశాలపై కూడా చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం,బీమా రంగంపై జీఎస్టీ మినహాయింపు నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే, సాధారణ వస్తువులపై పన్ను రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. 12% నుంచి 5% వరకు పన్ను రేట్లను తగ్గించుకునే సిఫార్సులను రాష్ట్ర మంత్రుల ప్యానెల్ పరిశీలించనుంది.
మిత్రపక్షాలను మచ్చిక చేసుకునేందుకు కేంద్రం నిర్ణయాలు
గత బడ్జెట్‌లో, బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి, మిత్రపక్షాలను మచ్చిక చేసుకునేందుకు కేంద్రం నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. 2025 బడ్జెట్‌లో ఏమైనా కొత్త నిర్ణయాలు ఉంటాయా అని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు.