Adani: రూ.6,000 కోట్ల పెట్టుబడితో 'అదానీ హెల్త్ సిటీస్'
ఈ వార్తాకథనం ఏంటి
అదానీ గ్రూప్ రూ.6,000 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 1,000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్ కోసం మాయో క్లినిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది.
ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా, అన్ని సామాజిక, ఆర్థిక స్థాయిలో గల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆస్పత్రులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది.
వివరాలు
అత్యాధునిక వైద్య సదుపాయాలు
'అదానీ హెల్త్ సిటీస్'గా పేరుపొందనున్న ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్‌లలో, 150 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 80 మందికి పైగా రెసిడెంట్ డాక్టర్లు, అలాగే 40 మందికి పైగా ఫెలోషిప్ డాక్టర్లు విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మెడికల్ కాలేజీలతో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలను ఈ హెల్త్ క్యాంపస్‌లు కలిగి ఉంటాయని తెలిపారు.
ప్రత్యేకంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, క్లినికల్ రీసెర్చ్ వంటి అత్యాధునిక వైద్య రంగాల్లో దృష్టిని కేంద్రీకరించే ట్రాన్సిషనల్ కేర్ యూనిట్లు, రీసెర్చ్ సెంటర్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ
ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధిని మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
మాయో క్లినిక్‌తో వారి భాగస్వామ్యం, దేశంలో వైద్యసేవల ప్రమాణాలను మరింత పెంచేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు.
'అదానీ హెల్త్ సిటీస్' అన్ని వర్గాల ప్రజలకు ప్రాప్యత ఉండేలా రూపుదిద్దుకుంటోందని, అత్యున్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.