Page Loader
RBI annual report: 2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక 
2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక

RBI annual report: 2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2026లో కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణ అంచనాల పరంగా,జీడీపీ వృద్ధి విషయంలో స్థిరత ఉండటంతో, ద్రవ్య విధానాన్ని ముందుకు నడిపించడానికి ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ విషయాలను ఆర్‌బీఐ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.

వివరాలు 

భారత ఆర్థిక స్థితిగతుల శక్తి ఎక్కడ? 

వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ తన బలమైన స్థూల ఆర్థిక ప్రణాళికలు, స్థిరమైన వృద్ధి రేటు, ధృఢమైన ఆర్థిక రంగం ఆధారంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని నివేదిక తెలియజేసింది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితులు, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు, సరఫరా గొలుసుల్లో అడ్డంకులు, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే ప్రమాదాలు దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ స్థాయిపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

వివరాలు 

వృద్ధికి అనుకూలంగా మారిన పరిస్థితులు 

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. వినియోగ డిమాండ్‌లో తిరిగి వృద్ధి కనిపించడమూ, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మూలధన వ్యయంపై దృష్టి సారించడమూ ప్రధాన కారణాలుగా పేర్కొంది. నిరంతరం మూలధన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడమే వృద్ధికి కీలకంగా మారుతుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పాత్ర కూడా పెరుగుతున్నదని పేర్కొంది.

వివరాలు 

తయారీ రంగానికి బలమైన తోడ్పాటు 

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన "నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్" 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత బలాన్నిస్తోంది. దీని వల్ల తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనీ, దేశీయంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే భారత్ 14 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో, 6 ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వామిగా ఉంది. ఇకపోతే అమెరికా, ఒమన్, పెరూ, యూరోపియన్ యూనియన్ (EU)తో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్నిస్తాయని పేర్కొంది. 2024-25లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడిందని వివరించింది.

వివరాలు 

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శం 

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ ప్రబలమైన నాయకత్వాన్ని కొనసాగిస్తోందని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపులలో భారత్ వాటా 48.5 శాతంగా ఉందని చెప్పింది. అంతేకాక, దేశ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం,ఈక్విటీ మార్కెట్లలో స్థిరమైన విలువలు ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నాయని వివరించింది.

వివరాలు 

ద్రవ్యోల్బణ నియంత్రణకు అనుకూల సంకేతాలు 

ప్రపంచ వస్తువుల ధరలు తగ్గడం, సరఫరా గొలుసులపై ఒత్తిడులు తగ్గిపోవడం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగడం.. ఇవన్నీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సహకరించే అంశాలుగా పేర్కొంది. అయితే, కొన్ని సందర్భాల్లో టారిఫ్ విధానాల్లో మార్పుల వలన ఆర్థిక మార్కెట్లలో స్వల్ప అస్థిరత నెలకొనవచ్చని హెచ్చరించింది. ఇవి ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశముందని ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.