Biggest Indian IPO: భారతదేశ అతిపెద్ద IPOకి సెబీ గ్రీన్ సిగ్నల్.. అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం..?
భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హ్యుందాయ్ మోటర్ ఇండియా ఓపెన్ పబ్లిక్ ఆఫర్ (ఓపీఓ) ద్వారా రూ. 25,000 కోట్లు సమీకరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించగా, సెబీ ఈ మొత్తం ఆమోదం తెలిపింది. హ్యుందాయ్ మోటర్ ఐపీఓను అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. 2.7 బిలియన్ డాలర్ల లిస్టింగ్ ద్వారా హ్యుందాయ్ ఐపీఓ, ఎల్ఐసీ రికార్డును అధిగమించే అవకాశముందని అంటున్నారు. హ్యుందాయ్ మోటార్ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ.
ఎల్ఐసీ రికార్డు బ్రేక్!
2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించగా, ఇప్పటివరకు అది స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. కానీ, హ్యుందాయ్ మోటర్ ఇండియా ఐపీఓ రాకతో ఎల్ఐసీ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. హ్యుందాయ్, ఈ ఐపీఓలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు, సెబీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత స్విగ్గీ తన ఐపీవో పరిమాణాన్ని 1.4 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 11,700 కోట్లు) పెంచాలని యోచిస్తోంది. సెబీకి అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించడం, ఆఫర్ పరిమాణాన్ని పెంచడానికి అక్టోబర్ మొదటి వారంలో వాటాదారుల సమావేశాన్ని నిర్వహించేందుకు స్విగ్గీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జొమాటో ఐపీవోని అధిగమించిన స్విగ్గీ
2021లో జొమాటో ప్రారంభించిన రూ. 9,375 కోట్ల ఇష్యును స్విగ్గీ ఐపీవో అధిగమించనుంది. 2022 మే నుంచి పబ్లిక్ ఆఫరింగ్ కోసం 10 కంపెనీలు రూ. 17,047 కోట్లను సమీకరించాయి. జొమాటో ఐపీఓ 2021లో వచ్చినప్పుడు ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఇదిలా ఉండగా, స్విగ్గీ 2023 ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ నష్టాన్ని రూ. 4,179 కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,350 కోట్లకు తగ్గించుకున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది.