
Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్ స్టాక్స్ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ దుస్సాహసానికి పాల్పడుతోంది.
జమ్మూ ప్రాంతంలోని విమానాశ్రయం, అలాగే సరిహద్దుల వెంబడి ఉన్న కొన్ని సైనిక స్థావరాలను గురువారం లక్ష్యంగా చేసుకొని దాడులకు యత్నించింది.
అయితే, భారత సాయుధ దళాలు ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొని నిలువరించాయి.
పాక్ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను, మూడు ఫైటర్ విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి.
ఈ ఘటనలతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
వివరాలు
18 శాతం పెరిగిన ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ షేరు
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు గణనీయంగా లాభపడుతున్నాయి.
బీఎస్‌ఈలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షేరు ధర 9.73 శాతం పెరిగింది. పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 5.89 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 4.88 శాతం, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ 3.63 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 3.60 శాతం లాభాల్లో ఉన్నాయి.
డ్రోన్ల తయారీ రంగంలో ఉన్న ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ షేరు ఏకంగా 18 శాతం పెరిగింది.
అలాగే డ్రోనాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ 4.99 శాతం లాభాలతో కొనసాగుతోంది.
వివరాలు
నష్టాలలో దేశీయ స్టాక్ మార్కెట్
అయితే దీనికి విరుద్ధంగా, దేశీయ స్టాక్ మార్కెట్ మొత్తం మాత్రం నష్టాలలో కొనసాగుతోంది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 800 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది.
సెన్సెక్స్‌లో ఉండే 30 ప్రధాన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ లాంటి కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం టైటాన్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.