LOADING...
Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్
బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్

Starlink price in India: బంగ్లాదేశ్‌లో ఉన్న ధరలకే ఇండియా డేటా ప్లాన్‌లను అందించనున్న స్టార్‌లింక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవలే ఈ కంపెనీకి టెలికమ్యూనికేషన్స్ శాఖ కీలకమైన అనుమతులను మంజూరు చేసింది. ఇప్పటికే భారతీ ఎయిర్‌ టెల్‌కు చెందిన వన్‌వెబ్‌, రిలయన్స్‌ జియో వంటి కంపెనీలు ఈ రకమైన అనుమతులను సంపాదించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లో స్టార్‌లింక్ సేవల ధర ఎంత ఉండవచ్చనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో సేవలందిస్తున్న స్టార్‌లింక్, ఇటీవల బంగ్లాదేశ్ మార్కెట్లోనూ ప్రవేశించింది. అక్కడ హార్డ్‌వేర్‌ (డేటా రిసీవింగ్‌ డివైస్‌) ధరను రూ.33,000గా నిర్ణయించింది. అలాగే నెలవారీ ఇంటర్నెట్‌ ప్లాన్‌లు రూ.3,000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

వివరాలు 

ఫైబర్‌ సేవలతో పోల్చితే ఖరీదే ఎక్కువ 

ఈ ధరలే భారత్‌లోనూ అమలవ్వవచ్చని సంబంధిత వర్గాల మాటలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ-18 ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాల్లో జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి ప్రముఖ టెలికం కంపెనీలు ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్నాయి. ఈ కంపెనీల మధ్య ఉన్న పోటీ కారణంగా ఉచిత ఇన్‌స్టలేషన్‌, తక్కువ ధరలో అపరిమిత డేటాతో కూడిన ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు 100 Mbps వేగంతో అపరిమిత డేటాను రూ.1,000 లోపు ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు. వీటితో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారాల యాక్సెస్‌, టీవీ బండిల్స్ వంటి అదనపు లాభాలు ఉన్నాయి.

వివరాలు 

స్టార్‌లింక్‌కు సుమారు 7,000 శాటిలైట్లు

ఇవన్నీ పరిశీలించినపుడు స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరలో లభించే ఫైబర్‌ ఇంటర్నెట్‌తో పోల్చితే ఖరీదైనవే. అయినప్పటికీ, టెలికం నెట్‌వర్క్‌ అందని దూర ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు కీలకంగా ఉపయోగపడతాయి. ఇది సాంప్రదాయ ఉపగ్రహాల ద్వారా కాకుండా, భూమికి అత్యంత సమీపంలో ఉండే ఎల్‌ఈఓ (లో ఎర్త్ ఆర్బిట్‌) శాటిలైట్ల ద్వారా సేవలను అందిస్తుంది. ఈ శాటిలైట్లు భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు సుమారు 7,000 శాటిలైట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 40,000కి పెంచే ప్రణాళిక ఉంది.

వివరాలు 

స్పెక్ట్రమ్‌ కేటాయింపు అనంతరం సేవల ప్రారంభం 

లైసెన్స్‌ పొందిన సంస్థలు ఇప్పటికీ వాణిజ్య శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ స్పెక్ట్రమ్‌ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్పెక్ట్రమ్‌ ధరలు, నిబంధనలు, షరతులపై టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసులు పంపింది. కేంద్ర ప్రభుత్వం వీటిపై తుది మార్గదర్శకాలను విడుదల చేసిన అనంతరం మాత్రమే స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరగనున్నాయి. ఈ కేటాయింపుల తర్వాతే సంబంధిత సంస్థలు తమ సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించగలవు.

వివరాలు 

స్పెక్ట్రమ్‌ కేటాయింపు అనంతరం సేవల ప్రారంభం 

అంతేకాదు, శాటిలైట్ సేవలకు అనుమతుల కోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (IN-SPACe) నుంచి కూడా సంస్థలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్త ప్రక్రియల దృష్ట్యా, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యేందుకు కనీసం మరో సంవత్సరం సమయం పడుతుందన్నది పరిశ్రమలో ఉన్నవారి అంచనా.