
US Tariffs: ట్రంప్ సుంకాలతో భారీగా ధర పెరిగే వస్తువులు ఇవే.. నిపుణులు ఏమంటున్నారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నిర్ణయంతో భారత ఉత్పత్తులపై అదనంగా 25శాతం సుంకం విధించారు. దీని ఫలితంగా మొత్తం సుంకం 50శాతానికి పెరిగింది.ఈ విధానం వల్ల తోలు,రసాయనాలు, పాదరక్షలు,రత్నాలు,ఆభరణాలు,వస్త్రాలు,రొయ్యలు వంటి ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ప్రకారం,న్యూఢిల్లీ రష్యా చమురును కొనుగోలు చేయడం పట్ల శిక్షారూపంగా ఈఅదనపు సుంకం విధించబడినట్టు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 27 నుండి అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి చైనా,భారత్, టర్కీలపై మాత్రమే ఈ రకమైన పన్నులు వర్తించనున్నాయని స్పష్టం చేశారు. అంతకుముందు జూలై 31న ప్రకటించిన 25 శాతం సుంకం,ఆగస్టు 7 ఉదయం 9:30 గంటల నుండి అమల్లోకి వచ్చింది.
వివరాలు
భారీ ధరలతో భారత్ ఎగుమతులు క్షీణించే ప్రమాదం
థింక్‌ట్యాంక్ GTRI ప్రకారం,ఈకొత్త సుంకాల కారణంగా భారతీయ ఉత్పత్తులు అమెరికాలో మరింత ఖరీదైనవిగా మారుతాయి. దీని వల్ల అమెరికాకు జరిగే భారత ఎగుమతులు 40-50శాతం వరకు పడిపోవచ్చని అంచనా. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెగా మోడా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ గుప్తా వెల్లడించిన ప్రకారం,భారత రొయ్యలు ఇప్పటికే అమెరికాలో అధిక ధరలు కలిగి ఉండగా,ఈ అదనపు సుంకంతో మరింత ఖరీదైనవిగా మారుతాయని చెప్పారు. ఆయన వివరించినట్లుగా,ఈక్వెడార్ దేశానికి అమెరికా కేవలం 15శాతం సుంకాన్ని మాత్రమే విధిస్తోంది. ఇక భారత రొయ్యలపై ఇప్పటికే 2.49శాతం యాంటీ-డంపింగ్ సుంకం,5.77శాతం కౌంటర్‌వెయిలింగ్ సుంకం విధించబడి ఉంది. ఈ తాజా 25శాతం సుంకంతో కలిపి ఆగస్టు 7 నుంచి మొత్తం సుంకం 33.26శాతానికి పెరుగుతుందని తెలిపారు.
వివరాలు
వస్త్ర రంగంపై భారీ ప్రభావం - CITI ఆందోళన
భారత టెక్స్టైల్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ (CITI) ప్రకారం, ఈ తాజా 50 శాతం సుంకం భారత వస్త్ర, దుస్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పోటీతో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తున్న ఈ రంగం మరింత కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందంటూ ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా మార్కెట్లో తమ వాటాను నిలుపుకోవడంలో భారత్ పోటీపడుతున్న పరిస్థితుల్లో, ఈ సుంకం భారత ఉత్పత్తుల ఖరీదును పెంచి దేశాన్ని ప్రతిస్పర్థులకంటే వెనక్కి నెట్టి వేస్తుందని పేర్కొంది.
వివరాలు
ఇతర రంగాలపై ప్రభావం - అధిక శాతం టారిఫ్‌లు
GTRI ప్రకారం, అమెరికాకు భారత ఎగుమతుల్లో సేంద్రీయ రసాయనాలపై సుమారు 54 శాతం అదనపు సుంకం విధించనున్నారు. అలాగే, ఇతర అధిక సుంకం భరించే రంగాల్లో కార్పెట్లు (52.9%), అల్లిన దుస్తులు (63.9%), నేసిన దుస్తులు (60.3%), తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులు (59%), వజ్రాలు, బంగారం ఉత్పత్తులు (52.1%), యంత్రాలు మరియు యాంత్రిక పరికరాలు (51.3%), ఫర్నిచర్, పరుపులు (52.3%) ఉన్నాయి.
వివరాలు
ఎవరు ఈ ఖర్చును భరిస్తారు? - వ్యాపారుల ఆందోళనలు
కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా అభిప్రాయం ప్రకారం,ఈ చర్య భారత ఎగుమతులపై తీవ్రమైన దెబ్బగా నిలుస్తుంది. అమెరికాకు భారత్ చేసే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 55శాతం భాగం ఈ సుంకం ప్రభావానికి లోనవుతుందని అన్నారు. "50 శాతం పరస్పర సుంకం ఖర్చును పెంచుతుంది. తక్కువ సుంకాలు ఉన్న దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే,భారత ఎగుమతిదారులు 30-35శాతం పోటీ లోపం ఎదుర్కొంటారు" అని తెలిపారు. ఇంకా,"అధిక స్థల వ్యయాల దృష్ట్యా కొనుగోలుదారులు తమ సోర్సింగ్ నిర్ణయాలను మళ్లీ పునఃసమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఎగుమతి ఆర్డర్‌లు రద్దయ్యాయి.చిన్న స్థాయి MSMEలు ఈ వ్యయ భారాన్ని భరించలేవు. లాభాలు బాగా తక్కువగా ఉన్న దశలో ఈ కొత్త ఒత్తిడి,ఖాతాదారులను కోల్పోయే ప్రమాదాన్ని తీసుకువస్తుంది"అని షా పేర్కొన్నారు.
వివరాలు
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం వివరాలు - ప్రభావిత రంగాలు
2024-25లో భారత్ మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో భారత్ అమెరికాకు 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతించింది, అమెరికా నుంచి 45.3 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతిగా స్వీకరించింది.
వివరాలు
ఈ సుంకాలతో ప్రభావితమయ్యే ముఖ్య రంగాలు:
వస్త్రాలు/దుస్తులు - 10.3 బిలియన్ డాలర్ల వ్యాపారం రత్నాలు, ఆభరణాలు - 12 బిలియన్ డాలర్లు రొయ్యలు - 2.24 బిలియన్ డాలర్లు తోలు, పాదరక్షలు - 1.18 బిలియన్ డాలర్లు రసాయనాలు - 2.34 బిలియన్ డాలర్లు విద్యుత్, యాంత్రిక పరికరాలు - సుమారు 9 బిలియన్ డాలర్లు