డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వద్ద ఉన్న ఆరు వివాదాలను పరిష్కరించుకునేందుకు అమెరికా, భారత్ అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్ ప్రకటించారు. 2018లో జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 25శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10శాతం దిగుమతి సుంకాలను విధించింది. ప్రతీకారంగా భారతదేశం జూన్ 2019లో చిక్‌పీస్, కాయధాన్యాలు, బాదం, వాల్‌నట్‌లు, యాపిల్స్, బోరిక్ యాసిడ్, డయాగ్నోస్టిక్ రియాజెంట్‌లతో సహా 28అమెరికన్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు విధించింది. ఈ సుంకాలకు సంబంధించి డబ్ల్యూటీఓలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఆ వివాదానికి ఇరుదేశాలు తెరదింపాయి.
ఈ ఒప్పందంతో మరింత బలపడనున్న అమెరికా- భారత్ వాణిజ్య బంధం
భారత్ సుంకాలు తగ్గించడం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తిదారులు, తయారీదారులకు భారత మార్కెట్ అవకాశాలను పునరుద్ధరిస్తాయని, విస్తరిస్తాయని యూఎస్ పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల తమ దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా పెరుగుతాయని కేథరీన్ తాయ్ చెప్పారు. ఆరు వివాదాల్లో నుంచి మూడు ఉండగా, అమెరికా నుంచి మరో మూడు ఉన్నాయి. వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండు దేశాలు పరస్పరం అంగీకరించిన నిబంధనలపై వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఆ తర్వాత జెనీవా కేంద్రంగా నడుస్తున్న డబ్ల్యూటీఓకు తెలియజేయాల్సి ఉంటుంది. భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ద్వైపాక్షిక వస్తువుల వ్యాపారం 2021-22లో 119.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2022-23లో అది 128.8 బిలియన్ డాలర్లకు పెరిగింది.