Page Loader
Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు 
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు

Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొద్ది వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఈ చర్చల్లో నిర్ణయమవుతాయని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం తెలిపారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యాన్ని,ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనం కలిగేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని, బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(BTA)పై తొలి దశ చర్చలు 8-9నెలల్లో పూర్తవుతాయని అగర్వాల్ తెలిపారు. అమెరికా పారిశ్రామిక వస్తువుల ఎగుమతులకు భారత్‌ అంగీకారం తెలిపింది; అదే విధంగా, భారత తయారీ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించేందుకు అమెరికా ముందుకొచ్చింది.

వివరాలు 

టారిఫ్‌లు తగ్గేనా? 

వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచడానికి ఇరు దేశాలు కలిసి పని చేయనున్నాయి. ప్రస్తుతానికి, భారత్‌ అమెరికాకు 4 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 200 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలంటే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వంటి ఒప్పందం అవసరమని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్‌వాల్ తెలిపారు. సాధారణంగా, FTA కింద ఇరు దేశాలు అధిక సంఖ్యలో వస్తువులపై తక్కువ కస్టమ్స్ సుంకం లేదా పూర్తిగా మినహాయింపు కల్పిస్తాయి. అంతేకాకుండా, సేవల వాణిజ్యానికి సంబంధించిన నిబంధనలను సరళీకరిస్తాయి.

వివరాలు 

భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే ఉత్పత్తుల టారిఫ్ కేవలం 5%

అమెరికా ఇటీవల ప్రకటించిన ప్రతీకార టారిఫ్‌లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపినప్పటికీ, భారత్‌పై ప్రభావం పరిమితంగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం, అమెరికా వాణిజ్య లోటును తగ్గించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నదని భావిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్రకారం, భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే ఉత్పత్తుల 75% పై సగటు టారిఫ్ కేవలం 5% మాత్రమే ఉంది. కానీ, అమెరికాలో భారత్‌ ఎగుమతి చేసే పలు ఉత్పత్తులపై 15-35% మేర కస్టమ్స్ సుంకం విధించబడుతోంది.

వివరాలు 

జనవరిలో పెరిగిన ఎగుమతులు 

ఈ ఏడాది జనవరిలో అమెరికాకు భారత్‌ 8.44 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది 2024 జనవరి కన్నా 39% అధికం. అదే సమయంలో, దిగుమతులు 33.46% పెరిగి 3.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023-24 ఏప్రిల్-జనవరి కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 62.84 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2024-25 ఇదే కాలానికి 8.95% వృద్ధితో 68.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

వివరాలు 

ప్రతీకార టారిఫ్‌లపై భారత్‌ స్పందన 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్‌లను చట్టబద్ధం చేసిన తర్వాతే భారత్ వాటిపై నిర్ణయం తీసుకుంటుందని వాణిజ్య శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టారిఫ్‌ల అమలైన తర్వాత, వాటి ప్రభావాన్ని విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.