Tesla: మోడీ-మస్క్ సమావేశం.. భారతదేశంలో టెస్లా నియామకాలు షురూ
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం టెస్లా (Tesla) భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తోంది.
అయితే, దిగుమతి సుంకాలు,ఇతర కారణాల వల్ల ఈ ప్రణాళికలు ఇప్పటివరకు అమలులోకి రాలేదు.
అయితే, తాజాగా ఈ విషయంలో కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.
తాజాగా, టెస్లా భారత్‌లో నియామకాల ప్రక్రియను ప్రారంభించి, దేశీయ మార్కెట్లో ప్రవేశానికి సంకేతాలు ఇచ్చింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం విశేషంగా మారింది.
వివరాలు
ఐదు పోస్టులకు నియామకాలు
కస్టమర్ సంబంధిత, బ్యాక్‌ఎండ్ జాబ్‌లు సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్డిన్ పేజీలో సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ వంటి కనీసం ఐదు పోస్టులకు ముంబయి, దిల్లీ నగరాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.
అలాగే, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలను కేవలం ముంబయి కేంద్రంగా మాత్రమే తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు (Tesla Entry to India) 2021 నుంచి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, దిగుమతి ఈవీలపై సుంకాలను తగ్గించాలంటూ మస్క్ కంపెనీ భారీ డిమాండ్ చేసింది.
వివరాలు
చర్చకు సుంకాల అంశం
అయితే, కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు, స్థానికంగా విడిభాగాలను కొనుగోలు చేయాలని టెస్లాకు స్పష్టమైన నిబంధనలు పెట్టింది.
దీనికి మస్క్ అభ్యంతరం తెలిపిన కారణంగా టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడం ఆలస్యం అవుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో,ఇటీవల 40,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.34లక్షలు) కంటే ఎక్కువ విలువైన హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110శాతం నుంచి 70 శాతానికి తగ్గించారు.
మరోవైపు,అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సుంకాల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.తాజా పరిణామాల దృష్ట్యా త్వరలోనే భారత రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.