Big IPOs in 2025: 2025లో జియో, ఫ్లిప్‌కార్ట్, ఎల్‌జీ వంటి కంపెనీల ఐపీఓల సందడి!
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్‌లో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు (IPOs) విశేషంగా ఆకర్షించాయి.
క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు చిన్న, పెద్ద ఐపీఓలు వరుసగా మార్కెట్‌లో ప్రవేశించాయి.
ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు సుమారు ₹1.62 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (QIP) రైట్స్ ఇష్యూలతో కలిపి ఈ ఏడాది కంపెనీలు ఈక్విటీ మార్కెట్ల ద్వారా మొత్తం ₹3 లక్షల కోట్లకు పైగా నిధులను పొందాయి.
ఈ ధోరణి వచ్చే ఏడాదిలో కూడా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.
వివరాలు
ఈ ఏడాదిలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యుగా హ్యుందాయ్ మోటార్స్ సంస్థ
2024లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు మార్కెట్ నుంచి నిధులను సమీకరించాయి.
ఈ ఏడాదిలో దాదాపు 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ₹27,870 కోట్ల విలువైన ఐపీఓ ద్వారా ఈ ఏడాదిలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యుగా నిలిచింది.
ఇది 2022లో ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ₹20,557 కోట్ల ఐపీఓ రికార్డును అధిగమించింది.
వచ్చే ఏడాది ఈ రికార్డును కొత్త ఐపీఓలు అధిగమించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
వచ్చే ఏడాది వచ్చేవి ఇవే..
2025లో కూడా పలు ప్రముఖ కంపెనీలు ఐపీఓలతో మార్కెట్‌లోకి రానున్నాయి.
ఇందులో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (LG IPO) 15 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐపీఓకి సిద్ధమవుతోంది.
వాల్‌మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు తరలించి ఐపీఓను ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇప్పటికే లిస్టయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ సంస్థల అనుబంధ సంస్థలు కూడా 2025లో ఐపీఓలకు రానున్నాయి.
గ్రీవ్స్ కాటన్ తన ఎలక్ట్రిక్ వాహన విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఐపీఓ ద్వారా లిస్ట్ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
వివరాలు
వచ్చే ఏడాది వచ్చేవి ఇవే..
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐపీఓ ద్వారా లిస్ట్ చేయనుంది.
బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ హోటల్ వెంచర్స్, హీరో ఫిన్‌కార్ప్, కెనరా రెబోకో వంటి అనుబంధ సంస్థలు కూడా మార్కెట్‌లోకి రానున్నాయి.
దేశీయంగా అతిపెద్ద సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ తమ అనుబంధ సంస్థలు జియో, టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన ఐపీఓలను 2025లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ముఖ్యంగా జియో ఐపీఓ 2025లో అతిపెద్ద ఐపీఓగా నిలవవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జియో ఇప్పటికే పెద్ద టెలికాం కంపెనీగా స్థిరమైన వృద్ధిని సాధించింది. ఈ ఐపీఓ హ్యుందాయ్ రికార్డును అధిగమించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
కొన్ని ఐపీఓలు వాయిదా పడే అవకాశం
మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని కంపెనీలు కూడా పబ్లిక్ ఇష్యూల కోసం సిద్ధమవవచ్చు.
అయితే, ఏవైనా కారణాల వలన కొన్ని ఐపీఓలు వాయిదా పడే అవకాశమున్నదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.