
Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఈసారి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31మంది సభ్యుల సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం నవీకరించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రోజున లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓట్లతో సభలో ఆమోదం పొందింది. బిహార్‌లో ఓటర్ల సమగ్ర సవరణపై విపక్షాలు ఆందోళనలు చేపట్టడం వలన, ఈ అంశంపై చర్చకు అవకాశం లేదు. బిల్లు పాసైన తర్వాత,లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడినట్లు ప్రకటించారు. ఆదాయపు పన్ను చట్టం 1961 నుండి ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉండగా,ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
వివరాలు
66 సార్లు బడ్జెట్‌లలో సవరణలు
విపక్షాల అభ్యంతరాలు ఎదుర్కొన్న ఈ బిల్లును అనంతరం సెలక్షన్ కమిటీకి తరలించారు. కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఆదాయపు పన్ను (సం. 2) బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెట్టారు. గత శుక్రవారం పాత బిల్లును ఉపసంహరించారు. సెలక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ దాదాపుగా ఆమోదించినట్లు మంత్రి వెల్లడించారు. 1961లో ప్రాథమికంగా రూపొందిన ఆదాయపు పన్ను చట్టం ఇప్పటి వరకు 66 సార్లు బడ్జెట్‌లలో సవరణలు చెందిన కారణంగా చాలా క్లిష్టంగా మారింది. 2024 జులై బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించి, దాన్ని సరళతరం చేయాలని ప్రకటించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ కొత్త బిల్లును రూపొందించారు.