
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నాడు ఫ్లాట్ గానే ట్రేడింగ్ ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, టారిఫ్‌ల విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి, భారత్‌తో ఇండోనేషియా తరహా ఒప్పందం కుదుర్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఇవాళ ట్రేడింగ్‌లో ఊగిసలాట కనిపిస్తోంది. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 82,552 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 25,183 స్థాయిలో ట్రేడవుతోంది. విదేశీ కరెన్సీ అయిన డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.89 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో హిందాల్కో,సన్ ఫార్మా,అపోలో హాస్పిటల్స్,ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల బాటలో కదులుతున్నాయి.
వివరాలు
బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పై వాషింగ్టన్‌లో భారత బృందం ఐదో దశ చర్చలు
టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎటర్నల్ స్టాక్స్ షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మేధో సంస్థ జీటీఆర్‌ఐ స్పందిస్తూ..."భారత్ ఆ తరహా ఒప్పందాన్ని అంగీకరిస్తే దేశీయ రంగాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం,డెయిరీ రంగాలు ఈ ఒప్పందంతో తీవ్రంగా దెబ్బతింటాయి. ప్రతిఫలంగా మనకు లాభపడే అవకాశం చాలా తక్కువ. దేశీయ టారిఫ్‌లను తొలగించేందుకు ఒప్పుకోవడం,మన ప్రయోజనాలకు హానికరంగా ఉండే ఒప్పందంలోకి వెళ్లడం కన్నా...ఏ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోకుండా ఉండటం ఎంతో ఉత్తమం" అని తెలిపింది. ఇక అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ - BTA)పై భారత బృందం వాషింగ్టన్‌లో ఐదో దశ చర్చలను జరుపుతోంది.