LOADING...
జూలై 30 నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే! 
జూలై 30 నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే!

జూలై 30 నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి ఇదే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రముఖ డిపాజిటరీ సంస్థ అయిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) తొలి పబ్లిక్ ఇష్యూ (IPO) జూలై 30న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ మార్కెట్‌ నుంచి మొత్తం రూ.4,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 1న ఈ పబ్లిక్ ఇష్యూ ముగియనుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ విండో జూలై 29 నుంచే తెరుచుకోనుంది. కంపెనీ ఈ ఐపీఓకి సంబంధించిన ధరల శ్రేణిని శుక్రవారం నాడు ఖరారు చేసింది. ఒక్కో షేర్‌కు ధరను రూ.760 నుంచి రూ.800 మధ్యగా నిర్ణయించింది. అథ్యతమ ధర రూ.800 వద్ద కంపెనీ రూ.4,011 కోట్లను సమీకరించనుంది.

వివరాలు 

ఐపీఓ పూర్తిగా "ఆఫర్ ఫర్ సేల్‌ (OFS)" రూపంలో జరుగుతుంది

రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌ అంటే 18 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అథ్యతమ ధర వద్ద ఒక లాట్‌కు రూ.14,400 పెట్టుబడి అవసరమవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 13 లాట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐపీఓ పూర్తిగా "ఆఫర్ ఫర్ సేల్‌ (OFS)" రూపంలో జరుగుతుంది. దీనిద్వారా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (NSE), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు తమ వాటాలను తగ్గించుకుంటున్నాయి. మొత్తం 5.01 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. దీనివల్ల ఎన్‌ఎస్‌డీఎల్‌కు నేరుగా ఎలాంటి డబ్బులు రావు.

వివరాలు 

ఎన్‌ఎస్‌డీఎల్‌ లిస్టింగ్‌కు వస్తున్న రెండవ డిపాజిటరీ సంస్థ

భారతదేశంలో అతిపెద్ద డిపాజిటరీగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌ ఇప్పటికే 2023 అక్టోబర్‌లోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి ఐపీఓకు అనుమతులు పొందింది. ఇదివరకు 2017లో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్‌ (CDSL) ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన డిపాజిటరీ సంస్థగా నిలిచింది. ఇప్పుడు ఎన్‌ఎస్‌డీఎల్‌ లిస్టింగ్‌కు వస్తున్న రెండవ డిపాజిటరీ సంస్థగా గుర్తింపు పొందుతోంది. డిపాజిటరీ కంపెనీల్లో ఏ సంస్థకైనా 15 శాతానికి మించి వాటా ఉండరాదన్నసెబీ నిబంధనల కారణంగా ప్రస్తుత వాటాదారులు వాటా తగ్గించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఐడీబీఐకి 26.10 శాతం, ఎన్‌ఎస్‌ఈకి 24 శాతం వాటా ఉంది.

వివరాలు 

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఎస్‌డీఎల్‌ నికర లాభం రూ.343 కోట్లు

ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్,యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్, ఐడీబీఐ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఎస్‌డీఎల్‌ నికర లాభం రూ.343 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.1,535 కోట్లు. ఎన్నాళ్లుగానో మదుపర్లు ఎదురుచూస్తున్న ఐపీఓ కావడంతో, దీనిపై మదుపర్లలో ఆసక్తి పెరిగింది. గూగుల్ ట్రెండ్స్‌లోనూ ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ గురించి నెటిజన్లు విస్తృతంగా శోధిస్తున్నారు.