Piyush Goyal: రేట్లు తగ్గించాలన్న పీయూష్ గోయల్.. స్పదించిన RBI గవర్నర్
డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నదని ఆయన తెలిపారు. సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించిన గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో గోయల్ మాట్లాడుతూ, గతంలో ఒబామా, ఇప్పుడు బైడెన్ ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ద్వారా రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయని, ట్రంప్ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలోపేతం కానుందని అభిప్రాయపడ్డారు.
మోదీ నిజాయితీతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు: గోయల్
ప్రధానమంత్రి మోదీ ప్రపంచవ్యాప్తంగా నాయకులు, వ్యాపారవేత్తల నమ్మకాన్ని చూరగొన్నారని, నిజాయితీతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని గోయల్ కొనియాడారు. గత దశాబ్దంలో మోదీ పాపులర్ లీడర్‌గా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ విజయంలో కీలకంగా నిలిచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ పలు బాధ్యతలు అప్పగించినందుకు గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో మెరుగుదల కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
రేట్లు తగ్గించండి
దేశంలో వినియోగాన్ని పెంచడానికి రేట్లు తగ్గించాలని పరిశ్రమలకు పీయూష్ గోయల్ సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ పెరగడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాలలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గడం గమనించవచ్చని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ కూడా వృద్ధిని పెంచడానికి కీలక రేట్లను తగ్గించాలని కోరారు. మంత్రిగారి వ్యాఖ్యలు ప్రాధాన్యం పొందాయి. అదే విధంగా, ఆర్థిక వృద్ధి పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముఖ్యమైన రేట్లను తగ్గించాలని కూడా సూచించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, వచ్చే నెలలో జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వరకు దీనిపై ఏమీ మాట్లాడే ఉద్దేశ్యం లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.