LOADING...
Sensex: భారత స్టాక్ మార్కెట్ జోరు.. 6 సెషన్లలో 2,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
భారత స్టాక్ మార్కెట్ జోరు.. 6 సెషన్లలో 2,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?

Sensex: భారత స్టాక్ మార్కెట్ జోరు.. 6 సెషన్లలో 2,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లు వరుస సెషన్లలో లాభాలను నమోదు చేస్తున్నాయి. బుధవారం నుంచి ఈ రోజు వరకు సూచీలు సానుకూలంగా ట్రేడింగ్ అయ్యాయి.మొత్తం ఆరు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. ఏప్రిల్ నెల తర్వాత ఇలాంటి స్థిరమైన ర్యాలీ మొదటిసారి కనిపించడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక్కసారిగా 400 పాయింట్లు పెరిగింది. ఆల్ టైమ్ హై 85,978 పాయింట్లతో ఉంది,ఇది రికార్డు స్థాయి కంటే కేవలం 5 శాతం తక్కువ. గతేడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ అత్యధిక స్థాయిని చేరింది.అదే రోజు నిఫ్టీ కూడా జీవితకాల గరిష్టం 26,277కు చేరింది. ప్రస్తుతం నిఫ్టీ రికార్డు స్థాయికి 5శాతం తక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతుంది.

వివరాలు 

జీఎస్టీ సంస్కరణల ప్రకటన.. నాలుగు సెషన్లలో లాభాల్లోనే ట్రేడింగ్

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న జీఎస్టీ సంస్కరణలను ప్రకటించనున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లలో ఉత్సాహం పెరిగింది. ఆ ప్రకటన తర్వాత సూచీలు వరుసగా నాలుగు సెషన్లలో లాభాల్లోనే ట్రేడింగ్ అయ్యాయి. అంతే కాకుండా, ఆగస్టు 14న ఎస్ అండ్ పీ గ్లోబల్ భారత్ వృద్ధి పై ఆశాజనకంగా ఉంటుందని పేర్కొంది. 2007 తర్వాత భారత్ రేటింగ్‌ను BBBకి అప్‌గ్రేడ్ చేయడం గమనార్హం. అలాగే, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

వివరాలు 

28% శ్లాబులో ఉన్న వస్తువులను 18%కి తగ్గించనున్నారు

జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని పన్ను రేట్లను తగ్గించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 28% శ్లాబులో ఉన్న వస్తువులను 18%కి తగ్గించనున్నారు. ఇది జరిగితే కొన్ని వినియోగ సామాగ్రి ధరలు తగ్గి వినియోగం పెరుగుతుందని అంచనా. అలాగే, కారు, బైక్ వంటి వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీపావళి వరకు కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేయనుందని తెలుస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు అంచనాలు కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉండటంతో మార్కెట్లు బూస్ట్ పొందుతున్నాయి. వీటితో సూచీలు ర్యాలీ అవుతున్నాయి.

వివరాలు 

సెన్సెక్స్ కొత్త రికార్డును సృష్టిస్తుందా? 

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు స్థాయిని చేరాలంటే ఇంకా 5 శాతం పెరగాల్సి ఉంది. ట్రెండ్ ఇదే రీతిలో కొనసాగితే అది సాధ్యమే. అయితే కొన్ని అంశాలపై ఇంకా అనిశ్చితి ఉంది. సెప్టెంబర్ 27 నుంచి భారత్ పై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరుగుతాయని సమాచారం ఉంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో ఇంకా స్పష్టత లేదు. Q1లో నిరాశపరిచిన కంపెనీలు రికవరీ సాధించాలి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడాలి. ట్రంప్ టారిఫ్ విధానాల్లో మార్పు అవసరం. ఇవన్నీ జరిగితే సెన్సెక్స్ ర్యాలీకి అడ్డంకులు ఉండవు. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని అంచనా.