Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఈ రోజు ప్రకటించనున్నందున, మదుపర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ స్వల్పంగా 16 పాయింట్ల లాభంతో 81,782 వద్ద, నిఫ్టీ 2.4 పాయింట్ల నష్టంతో 24,707 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 84.66 వద్ద స్థిరపడింది.
లాభాల్లో చైనా, హాంకాంగ్ సూచీలు
నిఫ్టీలో ట్రెంట్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. మరోవైపు ,అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియాలో రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.8 శాతం మేర నష్టపోయాయి, అయితే చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.