
Forbes Billionaires List 2025:ఫోర్బ్స్ సంపన్నుల జాబితా 2025 విడుదల.. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ మరోసారి నిలిచారు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 2025 ప్రపంచ కుబేరుల జాబితా (Forbes World's Billionaire List)లో ఆయన అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.
342 బిలియన్ డాలర్ల నికర సంపదతో మస్క్ ఈ ఘనత సాధించారు.
గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది.
టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (Twitter) వంటి ప్రముఖ కంపెనీలను కలిగి ఉన్న మస్క్, ప్రపంచంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం అమెరికా 902 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక ధనవంతులను కలిగిన దేశంగా నిలిచింది. చైనాలో 516 మంది, భారత్‌లో 205 మంది బిలియనీర్లు ఉన్నారు.
వివరాలు
భారత కుబేరుల స్థానం
భారత ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ (Mukesh Ambani) 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు.
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు. మరో భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానం దక్కించుకున్నారు.
ఆయన ఆసియాలో నాలుగో అత్యంత ధనవంతుడు, భారతదేశంలో రెండో అత్యంత ధనవంతుడుగా గుర్తింపు పొందారు.
చైనాకు చెందిన జాంగ్ యిమింగ్ (Zhang Yiming) 65.5 బిలియన్ డాలర్ల సంపదతో 23వ స్థానం దక్కించుకోగా, అదే దేశానికి చెందిన జాంగ్ షాన్షాన్ (Zhong Shanshan) 57.7 బిలియన్ డాలర్లతో 26వ స్థానంలో నిలిచారు.
వివరాలు
కొత్తగా Billionaire Listలో చేరిన వారు
ఈసారి ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 288 మంది కొత్త వ్యక్తులు చోటు దక్కించుకున్నారు. వీరిలో ప్రముఖులు:
రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ - 1.2 బిలియన్ డాలర్లు
బాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ - 1.1 బిలియన్ డాలర్లు
హాస్యనటుడు జెర్రీ సీన్ఫెల్డ్ - 1.1 బిలియన్ డాలర్లు
అంతేకాక, హెడ్జ్ ఫండ్ దిగ్గజం జిమ్ సైమన్స్ భార్య మార్లిన్ సైమన్స్ 31 బిలియన్ డాలర్ల సంపదతో ఈ కొత్త బిలియనీర్లలోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచారు.
గత ఏడాది మేలో జిమ్ సైమన్స్ మరణించిన సంగతి తెలిసిందే.