Page Loader
Happy Birthday Allu Arjun: మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. కట్‌చేస్తే 'పుష్ప'తో ప్రభంజనం
మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. కట్‌చేస్తే 'పుష్ప'తో ప్రభంజనం

Happy Birthday Allu Arjun: మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ.. కట్‌చేస్తే 'పుష్ప'తో ప్రభంజనం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ జన్మదినం. 'గంగోత్రి' చిత్రంతో కథానాయకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బన్నీ, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు. మొదటి సినిమా విజయవంతమైనప్పటికీ, ''ఈతనితో హీరోగానే ఎందుకు?'' అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అతడిలో హీరోకు అవసరమైన లక్షణాలు లేవంటూ విమర్శల వర్షం కురిపించారు. అయితే, అల్లు అర్జున్ ఆ విమర్శలను స్వీకరించి, తనలోని లోపాలను గుర్తించి మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఎదుగుతూ వచ్చాడు. చివరికి 'పుష్ప' సినిమాతో తన పూర్తి స్థాయి సత్తాను నిరూపించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల విలువైన బ్రాండ్‌గా మారాడు.

వివరాలు 

సుకుమార్‌తో కలసి ప్రయాణం

విజయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో మనం ఊహించలేం. కానీ నిరంతరంగా ప్రయత్నించడమే ముఖ్యం. బన్నీ కూడా అదే చేశాడు. 'బద్రీనాథ్', 'వరుడు' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, నిరుత్సాహపడకుండా ముందుకు సాగాడు. ఆ కష్టకాలంలో త్రివిక్రమ్‌తో చేసిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు మళ్లీ అతన్ని సరైన ట్రాక్‌లోకి తీసుకొచ్చాయి. తరువాత 'డీజే', 'సరైనోడు' వంటి మాస్ హిట్లు అతని ఖాతాలో చేరాయి. 'రేసుగుర్రం' సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అక్కడినుంచి బన్నీ రేంజ్ మారిపోయింది. తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తరించాలన్న లక్ష్యంతో దర్శకుడు సుకుమార్‌తో కలసి ప్రయాణం ప్రారంభించాడు.

వివరాలు 

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు 

వారిద్దరి కలయికలో వచ్చిన 'పుష్ప' సినిమా ప్రభంజనంలా దూసుకెళ్లింది. మొదటి భాగం కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, రెండో భాగంతో బన్నీ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అనూహ్యంగా రెండు వేల కోట్ల కలెక్షన్‌ను రాబట్టాడు. సినిమా కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్, ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ అందుకోలేని స్థాయిని చేరాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం ద్వారా టాలీవుడ్‌కి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వంటి లెజెండ్స్‌కు కూడా దక్కని బహుమతి కావడం విశేషం. అల్లు అర్జున్‌కు ఈ అవార్డు లభించడం తెలుగు పరిశ్రమకే గర్వకారణంగా మారింది.