LOADING...
Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్ 
'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్

Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు కమల్ హాసన్ పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో శింబు కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రిలీజ్ సమీపిస్తుండటంతో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, కమల్ హాసన్ కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి, "కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది" అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కర్ణాటకలో తీవ్ర నిరసనలకు దారితీశాయి. కన్నడ ప్రజలు ఈ వ్యాఖ్యలను తమ భాషా గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వివరాలు 

కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు

ఆ ఈవెంట్‌లో కమల్ మాట్లాడుతూ, "నా జీవితం, నా కుటుంబం తమిళమే. శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రానికి చెందినవాడైనా, నా కుటుంబ సభ్యుడే. కన్నడ భాష తమిళ భాష నుంచే పుట్టింది" అన్నారు. అయితే కమల్ ఈ మాటలను సమర్ధించుకోవడంతో, కన్నడవాళ్ల ఆగ్రహం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కన్నడ సంఘాలు, అభిమానులు రోడ్డెక్కి థగ్ లైఫ్ సినిమా పోస్టర్లను చించివేయడం, కమల్ హాసన్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 30, 2025లోగా క్షమాపణ చెప్పకపోతే, థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలకు అనుమతించం అని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పష్టం చేసింది.

వివరాలు 

"నేను తప్పుగా మాట్లాడలేదు.. క్షమాపణ చెప్పే అవసరం లేదు: కమల్ 

ఇదే సమయంలో కర్ణాటక హైకోర్టు కూడా కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయినప్పటికీ కమల్ హాసన్ తన మాటల్ని ఉపసంహరించుకోలేదు. ఆయన, "నేను తప్పుగా మాట్లాడలేదు.. క్షమాపణ చెప్పే అవసరం లేదు.. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదు" అని ప్రకటించారు. ఈ వివాదం నేపథ్యంలో, థగ్ లైఫ్ చిత్రం విడుదలపై కమల్ హాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో హైకోర్టు, "తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఎలా అంటారు? మీరు చరిత్రకారులా?" అంటూ కమల్‌ను ప్రశ్నించింది. వివాదాన్ని ముగించాలంటే క్షమాపణ చెప్పడం మంచిదని హైకోర్టు సూచించింది. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.