Chiranjeevi: 537 పాటలు, 156 చిత్రాలతో గిన్నిస్ రికార్డు సాధించిన చిరంజీవి
సినీ ప్రస్థానంలో నాలుగు దశాబ్దాలకుపైగా నటించి, కోట్లాది మంది అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు వరించిన నేపథ్యంలో తాజాగా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. చిరంజీవి 156 సినిమాల్లో నటించి, 537 పాటలకు స్టెప్పులేసి, 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు గిన్నిస్ బుక్‌లో ఆయన పేరు ఖరారైంది. ఈ సందర్భంగా గిన్నిస్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్, చిరంజీవిని ప్రత్యేకంగా సన్మానించారు.
చిరంజీవి ఖాతాలో ఇప్పటికే 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు
ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు హాజరయ్యి చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవి 1980లో విడుదలైన 'పునాదిరాళ్ళు' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆరంభంలోనే ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, తన నటన, డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఇప్పటికే ఆయనకు 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు సహా అనేక పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు.
చిరంజీవికి అభినందన వెల్లువ
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఎక్స్ ఖాతాలో చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. చిరంజీవి గిన్నిస్ బుక్స్ రికార్డులో చోటు సాధించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని, ఈ శుభ సందర్భంలో మెగాస్టార్‌కి అభినందనలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. చిరంజీవి తమ నటన, గ్రేస్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక సేవలందించారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.