
Mother's Day Special : తెలుగులో మదర్ సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన ఆ చిత్రాలు ఇవే ..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ మనిషికీ కనిపించే దైవం తల్లి.శ్రద్ధ, ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం ఆమె.
ప్రతి ఒక్కరికీ మొదటి గురువు తల్లే. తల్లి చేసిన త్యాగాలకు, చూపిన ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
ఈ సందర్భంగా తల్లి అనుబంధాన్ని ప్రతిబింబించే కొన్ని తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.
#1
గుంటూరు కారం (2024)
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ప్రధాన అంశం.
రమ్యకృష్ణ తల్లి పాత్రలో, మహేష్ బాబు కొడుకుగా నటించగా, శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.
#2
ఒకే ఒక జీవితం (2022)
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నిర్మితమైన ఈ ఫీల్-గుడ్ చిత్రం, తల్లి ప్రేమ చుట్టూ తిరుగుతుంది.
చిన్నపుడే తల్లిని కోల్పోయిన యువకుడు, టైమ్ మెషిన్ ద్వారా గతంలోకి వెళ్లి తల్లిని చూసి, గతంలో జరిగిన తప్పులను సరిచేయాలనుకునే కదలికలతో కథ సాగుతుంది.
అమల, శర్వా తల్లీ కొడుకులుగా నటించారు. రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
#3
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ యువతరానికి చేరువైన సినిమా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువకుల కథలో తల్లి ప్రేమను హృదయాన్ని తాకేలా చూపింది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి పాత్రలో అమల నటించగా, ఆమె కొడుకుగా అభిజిత్ కనిపించాడు. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి తదితరులు చిన్న పాత్రల్లో నటించారు.
#4
యోగి (2007) & ఛత్రపతి (2005)
వివి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'యోగి'లో తల్లి తన కొడుకును వెతుక్కుంటూ వచ్చినా, కలుసుకోకుండానే చనిపోతుంది.
శారద తల్లి పాత్రలో కనిపించారు. ఇది కన్నడ చిత్రం 'జోగి'కి రీమేక్.
అలాగే రాజమౌళి దర్శకత్వంలోని 'ఛత్రపతి'లో భానుప్రియ తల్లి పాత్రలో నటించగా, తల్లి విలువలను ప్రతిబింబించింది. ఈ చిత్రాన్ని 2023లో హిందీలో రీమేక్ చేశారు కానీ ఆశించిన విజయం సాధించలేదు.
#5
అమ్మ చెప్పింది (2006)
శర్వానంద్ నటించిన ఈ చిత్రంలో, సుహాసిని తల్లి పాత్ర పోషించారు. మానసిక వికాసం లేని తన కొడుకును, దేశాన్ని ఉగ్రదాడుల నుండి రక్షించేందుకు తల్లి చేసే త్యాగం ఇతివృత్తం. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
#6
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
రవితేజ, అసిన్ నటించిన ఈ చిత్రం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మదర్ సెంటిమెంట్ డ్రామా.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. జయసుధ తల్లి పాత్రలో రవితేజకు తల్లిగా నటించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
#7
సింహరాశి (2001) & పెదబాబు (2004)
రాజశేఖర్ హీరోగా నటించిన 'సింహరాశి' తమిళ చిత్రం 'మాయి'కి రీమేక్. తల్లి ప్రేమ ఆధారంగా సాగిన కథ. అలాగే 'పెదబాబు' చిత్రంలో జగపతిబాబు తల్లి ప్రేమ వల్ల దూరంగా జీవించే కొడుకు పాత్ర పోషించారు. సుహాసిని తల్లి పాత్రలో కనిపించారు.
#8
మాతృదేవోభవ (1993)
ఈ సినిమాలో తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ, తన పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందే కథాంశం చూపారు. మాధవి తల్లి పాత్ర పోషించగా, అజయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. పలు భాషల్లోకి రీమేక్ అయింది.
#9
అమ్మ రాజీనామా (1991)
దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో, తల్లిగా శారద జీవించింది. కుటుంబం కోసం తల్లి చేసే త్యాగాన్ని చూపే ఈ చిత్రం కన్నడలో 'లక్ష్మీ' ప్రధాన పాత్రలో రీమేక్ అయింది.
సురేష్ కృష్ణ దర్శకత్వంలో 'అమ్మ' (1991),ఎస్.వి.కృష్ణారెడ్డి -అలీ కాంబినేషన్ లో వచ్చిన 'యమలీల' (1994), మహేశ్ బాబు 'నాని', రామ్ చరణ్ 'చిరుత', వరుణ్ తేజ్ 'లోఫర్', పవన్ కళ్యాణ్ 'కొమరం పులి', నాగార్జున 'మనం' వంటి చిత్రాలు కూడా తల్లి అనుబంధాన్ని ప్రతిభావంతంగా చూపించాయి.