Suriya: తల్లి తీసుకున్న బ్యాంక్‌లోన్ తీర్చడానికే సినీ పరిశ్రమకు వచ్చా: సూర్య
కోలీవుడ్ హీరో సూర్య (Suriya) తన అద్భుతమైన నటనతో ఫాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఓ ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ఇటీవల, ఈ స్టార్ హీరో ఇండస్ట్రీకి రాకకు గల కారణాలను పంచుకున్నారు. ఆయన హీరో కావాలనే ఉద్దేశంతో ఈ రంగంలోకి రాకపోవడంతో పాటు, తన తల్లి తీసుకున్న బ్యాంక్ లోన్‌ను తీర్చడమే తన అసలు లక్ష్యమని వెల్లడించారు.
నాన్నకు తెలియకుండా అమ్మ రూ.25,000 లోన్: సూర్య
"నేను చదువు ముగిసిన వెంటనే ఓ గార్మెంట్ కంపెనీలో చేరాను.మొదట 15 రోజులకు నాకు రూ.750 జీతం ఇచ్చారు.మూడేళ్ల తర్వాత నా జీతం రూ.8000కి పెరిగింది.నేను ఒక రోజు సొంతంగా కంపెనీ పెట్టాలని అనుకున్నాను.కానీ,ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు.అప్పుడు మా నాన్నకు తెలియకుండా మా అమ్మ రూ.25,000 లోన్ తీసుకున్నానని నాకు చెప్పారు.ఆ లోన్‌ను తీర్చాలనే ఉద్దేశ్యంతో మణిరత్నం సినిమాలో అవకాశం రాగానే అంగీకరించాను.నేను చిత్ర పరిశ్రమలోకి రావాలని,నటుడిగా ఎదగాలని కలలో కూడా అనుకోలేదు.మా అమ్మకు రూ.25,000 ఇచ్చి 'మీ లోన్ అయిపోయింది. ఇక బాధపడొద్దు' అని చెప్పడానికి ఇదే మార్గం అని అనుకున్నాను..ఈ కారణంగానే నా కెరీర్ ప్రారంభించాను.ఇప్పుడు సూర్యగా అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాను," అని సూర్య పేర్కొన్నారు.
ఓ నెర్రుక్కు నెర్" సినిమాతో ఇండస్ట్రీకి సూర్య
1997లో విడుదలైన "ఓ నెర్రుక్కు నెర్" అనే తమిళ సినిమాతో సూర్య ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. వసంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మణిరత్నం నిర్మించారు, ఇందులో విజయ్ హీరోగా నటించగా సూర్య కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి తర్వాత, వరుస అవకాశాలు అందుకొని స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సూర్య నటించిన "కంగువ" (Kanguva) విడుదలకు సిద్ధంగా ఉంది. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా..
ఇటీవల, ఈ చిత్రం గురించి మాట్లాడిన సూర్య, "కంగువా" స్క్రిప్టు డైరెక్టర్ శివ ద్వారా వినగానే నేను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాను అనిపించింది. "బాహుబలి", "ఆర్‌ఆర్‌ఆర్", "కల్కి 2898 AD " వంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు చూశాము. ఈ విషయంలో కోలీవుడ్‌లో "కంగువా"తో మేము తొలి అడుగులు వేస్తున్నాం అనుకుంటున్నాను. తమిళ్‌లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు," అని తెలిపారు.