LOADING...
Valentine's Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్: ఈతరం హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమ కథలు
వాలెంటైన్స్ డే స్పెషల్: ఈతరం హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమ కథలు

Valentine's Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్: ఈతరం హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమ కథలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేమికుల దినోత్సవం అంటే యువతకు ఎంతో ప్రత్యేకమైన రోజు. గుండెల్లో దాచుకున్న ప్రేమను బయటపెట్టడానికి, మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు ఓ చక్కటి అవకాశం. తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే ప్రత్యేక సందర్భంగా వాలెంటైన్స్ డేను ప్రేమికులు భావిస్తారు. చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో గొప్ప ప్రేమ కథలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఏఎన్నార్ నటించిన 'దేవదాసు' నుంచి, నాగ చైతన్య తాజా చిత్రం 'తండేల్' వరకూ తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు సందడి చేశాయి. ప్రేమ అనేది అనిర్వచనీయమైన భావం కావడంతో, ప్రతి దర్శకుడు తనదైన శైలిలో ప్రేమను కథగా మలిచాడు. వాలెంటైన్స్ డే రోజున జంటగా కూర్చొని ఆస్వాదించగల కొన్ని లవ్ సినిమాలపై ఇప్పుడు దృష్టిపెడదాం.

వివరాలు 

సీతారామం

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా 'సీతారామం' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఓ సైనికుడు, ఓ యువరాణి మధ్య పుట్టిన మధురమైన ప్రేమను ఎంతో సున్నితంగా చూపించారు. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఎన్ని సార్లు చూసినా భావోద్వేగానికి గురిచేసే అరుదైన ప్రేమ కథలలో ఒకటిగా నిలిచింది.

వివరాలు 

ఏమాయ చేసావే

''ప్రపంచంలో ఇన్ని మంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?'' అనే డైలాగ్‌తో మొదలైన 'ఏమాయ చేసావే' నిజంగానే ప్రేక్షకులను మాయ చేసింది. లవ్ స్టోరీలలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చిన సినిమాగా ఇది గుర్తుండిపోతుంది. ప్రేమ కోసం ఎంత దూరమైనా ప్రయాణించవచ్చని, ఎంతకాలమైనా ఎదురుచూడవచ్చని చెప్పిన కథ ఇది. ఇందులోని ప్రేమ సన్నివేశాలు ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటాయి. అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

Advertisement

వివరాలు 

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

''ప్రేమ పుట్టడానికి క్షణమే సరిపోతుంది.. కానీ అది చచ్చిపోవడానికి మాత్రం ఒక జీవితం కూడా చాలదు'' అనే భావనను చెప్పిన చిత్రం 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'. అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన ఇద్దరు ప్రేమికులు, సంవత్సరాలు గడిచినా ఒకరినొకరు మర్చిపోకుండా జ్ఞాపకాలతో జీవిస్తూ ఉంటారు. చివరికి వారు మళ్లీ ఎలా కలుస్తారు అనే అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని క్రాంతి మాధవ్ తెరకెక్కించారు. థియేటర్లలో సాధించిన స్పందన కంటే, టీవీ ప్రసారాల తర్వాత ఈ సినిమాకు మరింత పెద్ద గుర్తింపు లభించి కల్ట్ స్టేటస్ వచ్చింది.

Advertisement

వివరాలు 

తొలిప్రేమ 

పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి కలిసి నటించిన 'తొలి ప్రేమ' కూడా కల్ట్ లవ్ స్టోరీల జాబితాలో నిలిచిపోయింది. జీవితంలో స్పష్టమైన లక్ష్యం లేని ఓ మధ్యతరగతి యువకుడు, ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ యువతి మధ్య ఏర్పడే ప్రేమను ఇందులో చూపించారు. అసభ్యకరమైన సన్నివేశాలకు తావులేకుండా, ప్రేమకు స్నేహానికి మధ్య ఉన్న తేడాను దర్శకుడు ఎంతో సున్నితంగా చూపించడంలో విజయం సాధించారు. ఇదే టైటిల్‌తో వరుణ్ తేజ్ నటించిన సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.

వివరాలు 

ఆర్య 

'ఆర్య' చిత్రంతో వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే 'మజిలీ', 'నువ్వు నేను ప్రేమ' వంటి సినిమాల్లో పెళ్లికి ముందు ప్రేమ, పెళ్లి తర్వాత భార్యతో ఏర్పడే మరో ప్రేమ ఎలా ఉంటుందో చూపించారు. యుక్త వయసు ప్రేమ కథలతో తెరకెక్కిన 'నువ్వు నేను', 'జయం' లాంటి చిత్రాలు అప్పట్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. ఒక యువకుడి జీవితంలో వివిధ దశల్లో ప్రేమ ఎలా మారుతుందో 'ప్రేమమ్' సినిమాలో చూపించారు. తన ప్రేమను గెలుచుకోవడానికి ఎంత కష్టమైనా పడే వ్యక్తి కథను 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'లో ఆవిష్కరించారు. 'ఓయ్', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'లవ్ స్టోరీ' వంటి చిత్రాలు కూడా ప్రేమికుల హృదయాలను తాకాయి.

వివరాలు 

సఖి 

మణిరత్నం తెరకెక్కించిన 'సఖి', 'ఓకే బంగారం' సినిమాలు ప్రేమతో పాటు ప్రేమికుల మధ్య వచ్చే సంఘర్షణలను కూడా సహజంగా చూపించాయి. 'చెలి', 'ప్రేమికుల రోజు', 'ప్రేమ లేఖ', 'ప్రియురాలు పిలిచింది' వంటి డబ్బింగ్ ప్రేమకథా చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. 'అర్జున్ రెడ్డి'లాంటి తీవ్ర భావోద్వేగాల ప్రేమకథకు యూత్ బలంగా కనెక్ట్ అయ్యారు. నేటి తరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా మోడరన్ డేస్ లవ్‌ను 'బేబీ' సినిమాలో చూపించారు.

వివరాలు 

ఆ కథలతో ఆడియన్స్ ప్రేమలో పడిపోతూనే ఉంటారు

కాలంతో పాటు ప్రేమ కథల రూపం మారుతున్నా, వాటి కేంద్రబిందువు మాత్రం 'ప్రేమ' ఒక్కటే. కొన్ని సినిమాలు హ్యాపీ ఎండింగ్‌తో ముగిస్తే, మరికొన్ని విషాదాంతంగా ప్రేక్షకుల మనసును కలచివేస్తాయి. అయినప్పటికీ ఆ కథలతో ఆడియన్స్ ప్రేమలో పడిపోతూనే ఉంటారు. అందుకే ఈ రోజుకీ ప్రేమ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి.

Advertisement