
#NewsBytesExplainer: విదేశీ సినిమాలపై ట్రంప్ 100% సుంకాలు.. టాలీవుడ్ పై ప్రభావం ఎంత ?
ఈ వార్తాకథనం ఏంటి
'అమెరికా ఫస్ట్' ధోరణితో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈసారి ప్రపంచ సినీ పరిశ్రమపై కన్నేశారు.
అమెరికా వెలుపల నిర్మితమయ్యే చిత్రాలపై 100 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ప్రకటన ప్రపంచ సినిమా రంగాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
ముఖ్యంగా భారతీయ సినిమాలపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందనే చర్చలు మొదలయ్యాయి.
బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు ఓవర్సీస్ కలెక్షన్లు ఇక అంత ఈజీగా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.
వివరాలు
డిస్ట్రిబ్యూటర్లకు గట్టి ఎదురుదెబ్బ
ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఇది ఎవరి మీద ఎలా వర్తిస్తుంది అన్నది పరిశ్రమలో గందరగోళానికి దారితీస్తోంది.
ఈ టారిఫ్‌లు పూర్తిగా విదేశీ నిర్మాణాలకేనా? లేక అమెరికన్ స్టూడియోలు విదేశాల్లో చిత్రీకరించే సినిమాలకూ వర్తిస్తాయా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టత లేదు.
అంతేకాక, థియేటర్లకు మాత్రమేనా? లేదా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలకూ ఈ సుంకాలు వర్తిస్తాయా? అనే అంశంలోనూ స్పష్టత లేదు.
అయితే, ఇప్పటికే విదేశీ సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ముందస్తు ఒప్పందాలతో ఫిల్మ్స్ కొన్నవారు ఇప్పుడు అనుకోని అదనపు ఖర్చుతో ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడినట్టు పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
భారతీయ సినిమాలకు దెబ్బేనా?
ట్రంప్ తీసుకున్న ఈ చర్య భారతీయ సినీ పరిశ్రమకు ముప్పుగా మారుతుందని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా భారతీయ సినిమాలు అమెరికాలో మంచి ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
పఠాన్, ఆర్‌ఆర్‌ఆర్, డుంకీ, జవాన్ వంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేశాయి.
వీటి విజయంతో ప్రపంచ సినీ వేదికపై భారత సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
ముఖ్యంగా ఉత్తర అమెరికాలో భారతీయ చిత్రాల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తి ఎంతో అధికంగా ఉంది.
కొన్నిసార్లు భారత్ కంటే ముందే అమెరికాలో సినిమాలు విడుదలవుతుండడం బాక్సాఫీస్ కలెక్షన్లను పెంచడంలో కీలకంగా మారుతోంది.
వివరాలు
రెట్టింపు పెట్టుబడి
కానీ, ఇప్పుడు ట్రంప్ టారిఫ్‌లు ఇండియన్ ఫిల్మ్స్ ఓవర్సీస్ మార్కెట్‌ను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి.
ఒక ఉదాహరణగా చెప్పాలంటే - ఒక అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక మిలియన్ డాలర్లకు భారతీయ సినిమా కొనుగోలు చేస్తే, ఇప్పుడు అదనంగా మరో మిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించాల్సి వస్తుంది.
అంటే మొత్తం పెట్టుబడి రెట్టింపవుతుంది. లాభదాయకత తక్కువగా ఉన్న చిన్న, మధ్యస్థాయి సినిమాలపై ఇది భారీ ప్రభావం చూపిస్తుంది.
వివరాలు
ఓటీటీకి తలనొప్పి తప్పదా?
ట్రంప్ ప్రకటనతో పలు ఓవర్సీస్ సినిమా డీల్స్ నిలిచిపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులపై ముందడుగు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు.
ఇదే విధంగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ - నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు కూడా ఈ సుంకాల ప్రభావంతో భారతీయ కంటెంట్ కోసం పెట్టుబడులు తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
దీని ఫలితంగా డిజిటల్ మార్కెట్‌పై ఆధారపడే భారత నిర్మాతలకు ఇది గట్టి ఎదురుదెబ్బ కావచ్చు.
ముఖ్యంగా ఓవర్సీస్ ఆదాయంపై ఆధారపడే చిన్న నిర్మాణ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది.
అమెరికాలో ఆదాయం పడిపోతే, సినిమాల బడ్జెట్ తగ్గించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.
వివరాలు
భారతీయ సినిమాలకి అమెరికాలో భారీ ఆదాయం
2023లో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్‌లో 20 మిలియన్ డాలర్లకు పైగా (రూ.168 కోట్లు) వసూలు చేశాయి.
పలు చిత్రాలు 1000కి పైగా స్క్రీన్లలో విడుదలయ్యాయి. రాబోయే కాలంలో సలార్ 2, స్పిరిట్, వార్ 2 వంటి పెద్ద సినిమాలు ఓవర్సీస్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్ విధానాలు భారత చిత్ర పరిశ్రమకు సవాళ్లుగా మారనున్నాయి.
ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశముందా..?
అయితే ట్రంప్ నిర్ణయాల్లో అనిశ్చితి ఎప్పటికప్పుడు కనిపిస్తుంది.
ఇప్పటికే ఇతర దేశాలతో పరస్పర సుంకాలపై చర్చలు జరుపుతూ కొన్ని సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో,సినీ రంగంపైనూ ఎలాంటి వెనక్కితగ్గే అవకాశముందా? లేదంటే ఈ నిర్ణయం కేవలం హాలీవుడ్‌కు మద్దతుగా తీసుకున్న వ్యూహమేనా అన్న ప్రశ్నలకు ఇప్పటికైనా స్పష్టత లేకపోవడం గమనార్హం.