Page Loader
Operation Sindhu: 'ఆపరేషన్‌ సింధు'.. ఇరాన్‌ నుండి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు
'ఆపరేషన్‌ సింధు'.. ఇరాన్‌ నుండి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

Operation Sindhu: 'ఆపరేషన్‌ సింధు'.. ఇరాన్‌ నుండి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
07:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు 'ఆపరేషన్ సింధు' పేరుతో ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 110 మంది విద్యార్థులు భారత్‌కు తిరిగివచ్చారు. ఈ ఆపరేషన్‌ తొలి దశలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 110 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించింది. బుధవారం రోజున ఆర్మేనియాలోని రాజధాని యెరవాన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఈ విద్యార్థులు బయలుదేరిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం తెల్లవారుజామున ఈ విద్యార్థులంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

వివరాలు 

భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం

భారత్‌కు చేరుకున్న విద్యార్థుల్లో అత్యధికంగా 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. స్వదేశానికి తిరిగివచ్చినందుకు విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో వారు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత విదేశాంగశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా అక్కడే ఉన్న భారతీయులను కూడా త్వరలోనే రప్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇక మరోవైపు, ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ కుదేలవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాన్ని తక్షణమే విడిచి, టెహ్రాన్ వెలుపల ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇంకా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించని వారు తొందరగా అక్కడి దౌత్యాధికారులతో సంప్రదించాలని సూచించింది.