16 Years Since 26/11: ముంబయి ఉగ్రదాడులకు 16 సంవత్సరాలు.. ఆనాటి హీరోలను స్మరించుకుందాం..
ముంబై 26/11 ఉగ్రదాడులు భారతదేశ చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిపోయాయి. 16 సంవత్సరాలు గడిచినా ఈ ఘటన దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంది. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబై నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. ఈ ఉగ్ర దాడులలో 175 మంది మరణించగా, వారిలో 166 మంది అమాయక పౌరులు కాగా, 9 మంది ఉగ్రవాదులు. ఈ ఘటనలో జీవించి పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్. అతడి విచారణలో పాకిస్తాన్ కుట్రలు వెల్లడయ్యాయి. భారత న్యాయవ్యవస్థ ప్రకారం కసబ్‌కు ఉరిశిక్ష విధించారు.
2008 ఉగ్రదాడులు: కీలక వివరాలు
ఈ ఘోర దాడుల్లో 20 మంది భద్రతా బలగాల సభ్యులు, 26 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు ముంబైని లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు.
ఆనాటి ఘటనలో హీరోలు వీరే..
తుకారాం ఓంబ్లే ముంబై పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబ్లే నిరాయుధంగా ఉన్నప్పటికీ అజ్మల్ కసబ్‌ను అడ్డుకోవడానికి తన ప్రాణాలను పణంగాపెట్టారు.గిర్గాం చౌపటీలో జరిగిన ఈపోరాటంలో ఆయన తన ప్రాణాలు కోల్పోయినా,కసబ్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు.దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అయిన అశోక్ చక్రను ఆయన త్యాగానికి గుర్తుగా 2009లో ప్రదానం చేశారు. హేమంత్ కర్కరే,అశోక్ కామ్టే,విజయ్ సలాస్కర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే,ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే,ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలాస్కర్‌లు కామా హాస్పిటల్ సమీపంలో జరిగిన ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఆనాటి ఘటనలో హీరోలు వీరే..
మల్లికా జగద్ తాజ్ హోటల్ మేనేజర్‌గా ఉన్న మల్లికా, అతిథులను రక్షించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక గదిలో అందరినీ నిశ్శబ్ధంగా ఉంచి, భద్రతా బలగాలు వచ్చే వరకు వారిని ప్రోత్సహించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కరంబీర్ సింగ్ కాంగ్ తాజ్ హోటల్ జనరల్ మేనేజర్ కరంబీర్, తన కుటుంబాన్ని కోల్పోయినా, హోటల్ అతిథులను రక్షించడంలో కృషి చేశారు. తన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కన పెట్టి, ఎంతో మందిని రక్షించడంలో కీలకంగా వ్యవహరించారు. థామస్ వర్గీస్ తాజ్ వాసబి రెస్టారెంట్ సీనియర్ వెయిటర్ థామస్ వర్గీస్ కస్టమర్లను సురక్షితంగా బయటకు పంపించి, చివరకు తాను బయటికి వచ్చే క్రమంలో ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.