
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. సంజయ్ గైక్వాడ్ పై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై పోలీస్ కేసు నమోదైంది. పాచిపోయిన పప్పు వడ్డించారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన ఒక జాతీయ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్ర విమర్శలకు దారితీశాయి. బుల్దానా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ గైక్వాడ్, ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్‌పై తీవ్రమైన హింసను ప్రదర్శించారు. పాడైన ఆహారం ఇచ్చారన్న కారణంతో,ఆ పప్పుతో ఉన్న బౌల్‌ను కాంట్రాక్టర్ ముక్కుకు దగ్గరగా ఉంచిన గైక్వాడ్, ఆ వెంటనే అతనిపై వరుసగా గుద్దుల వర్షం కురిపించారు.
వివరాలు
తన చర్యను సమర్థించుకున్న గైక్వాడ్
ఆ వ్యక్తి కింద పడిపోయినా, లేచే స్థితిలో లేకపోయినా, గైక్వాడ్ దాడిని ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు గట్టిగా స్పందించగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు ఈ పరిణామాల మధ్య, శుక్రవారం నాడు ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి కేసులు పెట్టారన్న దానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
వివరాలు
దక్షిణ భారతీయులపై సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, దక్షిణ భారతీయులపై సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ప్రజలు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ మహారాష్ట్ర సంస్కృతిని బలహీనతకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్రకు చెందిన వ్యక్తికే ఇవ్వాల్సింది కదా? మేము ఏం తినాలో మాకు బాగా తెలుసు. డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లు నడుపుతూ ఉండే దక్షిణాది వ్యక్తులు పిల్లలపై చెడు ప్రభావం చూపుతున్నారు. అలాంటి వారు మంచి భోజనాన్ని ఎలా ఇవ్వగలరు? అంటూ గైక్వాడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నాయి.