IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు
ప్రకృతి పగబట్టినట్టుగానే ఉందని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి, తీరం దాటిన తర్వాత ఇంకోటి, ఇలా వరసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 16వ తేదీన నెల్లూరు సమీపంలో తీరం దాటిన వాయుగుండం పూర్తిగా బలహీనపడకముందే, వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. 2024 అక్టోబర్ నెలలో,అంటే ఈ నెలలోనే,మిగిలిన 14రోజుల్లో సముద్రంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశమున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 21వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. నెలాఖరుకు పసిఫిక్ మహాసముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ. 21వ తేదీన ఏర్పడే ఉపరితల ఆవర్తనం 25వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు పేర్కొంది.
మళ్లీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
సముద్రంలో ఏర్పడుతున్న ఈ రెండు అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని తెలిపింది. అయితే, అల్పపీడనం బలపడితే, దిశ మార్చుకుంటే, మళ్లీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాటి గమనం, దిశ ఆధారంగా మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ విషయాలను IMD మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కేజే రమేష్ తెలిపారు.