Page Loader
Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది (2025) బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 20న దీపావళి,అక్టోబర్ 28న ఛత్ పూజ వంటి ప్రముఖ పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి చెందిన వర్గాలను ఉదహరిస్తూ జాతీయ మీడియా నివేదికలు వెలువడ్డాయి. ఇక బీహార్‌ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. తదనుగుణంగా, ఆ తేదీకి ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో..

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ నెలలో బీహార్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. త్వరలోనే ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఓటింగ్‌ జరిగింది. నవంబర్ 10న ఫలితాలను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ,జేడీయూ కలిసి పోటీ చేసిన ఎన్డీయే కూటమికి గణనీయమైన విజయవకాశాలు లభించాయి. అనంతరం వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

వివరాలు 

రెండు సంవత్సరాల వ్యవధిలోనే కూలిన ప్రభుత్వం 

అయితే, రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ చేతిలో అధిక ఆధిపత్యం ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. దీంతో నితీష్ కుమార్‌ 2022లో ఆ కూటమిని వదిలి ఆర్జేడీతో చేతులు కలిపారు. తద్వారా సీఎం పదవిని కొనసాగించారు. ఆ తర్వాత 2024 జనవరిలో నితీశ్ మళ్లీ బీజేపీతో కలవడం విశేషం.