Central Tax: కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే.. 9,15 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పన్నుల్లో 60% వాటా కేవలం ఏడు రాష్ట్రాలకు మాత్రమే వెళ్తోంది.
ఇందులో ఉత్తర్‌ప్రదేశ్ (18%), బిహార్ (10%) పెద్ద మొత్తంలో లబ్ధిపొందుతున్నాయి. మొత్తం వాటాలో తొలిమూడు స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లకు కలిపి దాదాపు 36% చేరుతోంది.
తొలి ఏడు రాష్ట్రాలలో ఉన్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలను కూడా కలిపితే మొత్తం రూ.7,75,242.02 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంజయ్ చౌధరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కేంద్రం మొత్తం రూ.12,86,885.44 కోట్లు పంపిణీ చేయగా, అందులో ఏడు రాష్ట్రాలకు 60% కేటాయించబడగా,మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% మాత్రమే దక్కినట్లు వెల్లడైంది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి రూ.2,03,327.38 కోట్లు (15.79%) మాత్రమే లభించాయి.
ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే వచ్చిన మొత్తం కంటే ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలకు 11.92% (రూ.27,527.24 కోట్లు) తక్కువగా కేటాయించబడింది.
తమ రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు అధికంగా ఉన్నప్పటికీ, కేంద్ర పన్నుల్లో వాటా ఎక్కువగా ఉత్తరాదికే వెళ్తోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.