
Telangana Floods: తెలంగాణలో వరదలకు కేంద్ర ప్రభుత్వ సాయం రూ.648 కోట్లు.. వెల్లడించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
2023 సెప్టెంబర్‌లో తెలంగాణను ప్రభావితం చేసిన వరదల నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ₹648 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
లోక్‌సభలో నల్గొండ ఎంపీ రఘువీర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్ర విపత్తు సహాయ నిధిలో (SDRF) ₹1,345.15 కోట్లు మిగిలున్నాయని, ఈ నిధులతో సహాయ, పునరావాస చర్యలు కొనసాగించేందుకు తగినంత ఉందని తెలిపారు.
వివరాలు
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు
తెలంగాణలో 2024 ఫిబ్రవరి 28 నాటికి 5,047ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు.
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా,2018-19 నుంచి 2023-24మధ్యకాలంలో వీటి ఏర్పాటుకు జాతీయ ఆరోగ్య మిషన్(NHM)కింద ₹108 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ఉపాధి హామీ బకాయిల వివరాలు
తెలంగాణ రాష్ట్రానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2024 మార్చి 18 నాటికి మొత్తం ₹468.57 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఇందులో ₹116.28 కోట్లు కూలీల వేతనాలు,₹352.29కోట్లు మెటీరియల్ బిల్లుల బకాయిలుగా ఉన్నాయని వెల్లడించారు.
వివరాలు
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఉద్యోగాల ఖాళీలు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి ₹14,681కోట్ల వేతన బకాయిలు,₹10,394కోట్ల మెటీరియల్ బకాయిలు ఉన్నట్లు వివరించారు.
బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో 62 బోధన, 475 బోధనేతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ తెలిపారు.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 183 బోధన ఉద్యోగాలకుగాను 121 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 1,374 బోధనేతర ఉద్యోగాలకుగాను 899 మంది మాత్రమే ఉన్నారని వివరించారు.
ప్రస్తుతం 500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణ ఖర్చు ₹1,365 కోట్లు అని వెల్లడించారు.
వివరాలు
చిన్నారులలో టీబీ కేసులు
గత మూడేళ్లలో తెలంగాణలో 6,200 చిన్నారులకు ట్యూబర్క్యులోసిస్ (TB) సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు.
2022లో 2,019, 2023లో 2,116, 2024లో 2,065 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం
తెలంగాణ గ్రిడ్‌కు 9,306మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ వెల్లడించారు.
రాజ్యసభలో భారాస సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇందులో 8,938 మెగావాట్లు డిస్కంలకు విక్రయించగా,368 మెగావాట్లు ఓపెన్ యాక్సెస్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ స్కీమ్‌లో కొత్త ప్రాజెక్టులు మంజూరుకాలేదని, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన లక్ష్యం చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులు లేవని వివరించారు.