Page Loader
AK-203 Rifle: నిమిషానికి 700 బుల్లెట్లు,800 మీటర్ల రేంజ్: అమేథిలో తయారు చేసిన 'ఏకే 203'రైఫిల్
నిమిషానికి 700 బుల్లెట్లు,800 మీటర్ల రేంజ్: అమేథిలో తయారు చేసిన 'ఏకే 203'రైఫిల్

AK-203 Rifle: నిమిషానికి 700 బుల్లెట్లు,800 మీటర్ల రేంజ్: అమేథిలో తయారు చేసిన 'ఏకే 203'రైఫిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, మరోవైపు సరిహద్దుల వద్ద విభిన్న రూపాల్లో విఘ్నాలు సృష్టిస్తున్న చైనా ఉన్న ఈ పరిస్థితుల్లో, భారత సాయుధ దళాలు తమ ఆయుధ సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యాధునికమైన ఏకే-203 తుపాకులు (AK-203 Rifle) భావించిన సమయానికి ముందే భారత సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. నిమిషానికి 700 రౌండ్ల వరకు కాల్చగల సామర్థ్యం ఈ తుపాకీకి ఉంది. అలాగే 800 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఎంతో ఖచ్చితంగా ఛేదించగలదు.

వివరాలు 

 భారత సాయుధ దళాలకు 6,01,427 ఏకే-203 తుపాకులు  

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో భారత్‌-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన 'ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' (IRRPL) సంస్థ 'షేర్' బ్రాండ్‌ పేరుతో ఏకే-203 తుపాకులను తయారు చేస్తోంది. రూ.5,200 కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 2032 అక్టోబర్‌ నాటికి మొత్తం 6,01,427 ఏకే-203 తుపాకులను భారత సాయుధ దళాలకు అందించాల్సి ఉంది. అయితే ప్రణాళికలో పేర్కొన్న సమయం కంటే 22 నెలల ముందుగానే,అంటే 2030 నాటికే వీటిని సైన్యానికి అందజేస్తామని సంస్థ సీఈఓ,మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.కె.శర్మ వెల్లడించారు. ఇప్పటివరకూ దాదాపు 48,000 తుపాకులను అందజేశామని, మరో రెండు నుంచి మూడు వారాల్లోగా 7,000 తుపాకులను అదనంగా అందించనున్నామని ఆయన వివరించారు. డిసెంబర్‌ నాటికి మరో 15,000 తుపాకులను భద్రతా దళాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

వివరాలు 

లాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యంత ప్రమాదకరమైన తుపాకులు

అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేయబడిన ఈ 'షేర్' తుపాకులు,ఇప్పటికే సాయుధ దళాల్లో వినియోగంలో ఉన్న ఏకే-47, ఏకే-56 తుపాకులతో పోల్చితే మరింత ఆధునికమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యంత ప్రమాదకరమైన తుపాకులుగా వీటిని భావిస్తున్నారు. ప్రస్తుతం సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్‌ తుపాకులకు బదులుగా ఈ ఏకే-203 తుపాకుల వినియోగాన్ని పెంచేందుకు ఆర్మీ యోచిస్తోంది. ఇన్సాస్‌ తుపాకుల కాలిబర్‌ 5.62 ఎంఎం కాగా, ఏకే-203 తుపాకుల కాలిబర్‌ 7.62 ఎంఎం. బరువు పరంగా చూస్తే,ఇన్సాస్‌ తుపాకీ బరువు 4.15 కేజీలు కాగా,ఏకే-203 తుపాకీ బరువు కేవలం 3.8 కేజీలే. పొడవు కూడా తక్కువగా 705 ఎంఎం మాత్రమే ఉంది.

వివరాల్లో 

నియంత్రణ రేఖ,వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాస్తున్న భారత సైనికులకు ఈ తుపాకులు

ప్రస్తుతం సరిహద్దుల్లో, ముఖ్యంగా నియంత్రణ రేఖ (LoC),వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పహారా కాస్తున్న భారత సైనికులకు ఈ తుపాకులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి అందితే మన సైనికుల పోరాట సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.