బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పాట్న వేదికగా సమావేశం కాబోతున్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రతిపక్ష నాయకుల సమావేశం జరగనుంది. కేంద్రంలో బీజేపీని అధికారం నంచి దించే ఆశయ సాధనకు ఈ సమావేశం దోహదపడుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పాట్నలో జరగనున్న ప్రతిపక్ష నాయకుల సమావేశం నేపథ్యంలో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు ఉండదనే పలువురు అపోజిషన్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాల సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, గురువారం నుంచి నేతలు పాట్నాకు చేరుకోవడం ప్రారంభిస్తారని బిహార్ జేడీ(యూ) నేత విజయ్ కుమార్ చౌదరి తెలిపారు.
మీటింగ్‌కి ఏ ఏ పార్టీ హాజరవుతోంది?
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రతిపక్ష నాయకుల సమావేశానికి హాజరుకానున్నారు. మెహబూబా ముఫ్తీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతా బెనర్జీ గురువారం పాట్నాకు చేరుకునున్నారు. ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌తో మమతా బెనర్జీ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం విపక్ష నేతల సమావేశం జరగనుంది.
బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల పోస్టర్ యుద్ధం
ప్రతిపక్షాల నాయకుల సమావేశానికి ముందు రాజకీయ వేడి రాజుకుంది. సమావేశానికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో విపక్షాల ఐక్యతను తెలియజేస్తూ ఓ పోస్టర్ వెలిసింది. బీజేపీని ఓడించాలనుకునే వారు ముందుకు రావాలని, 2024లో 80 సీట్లలో కాషాయ పార్టీని ఓడించాలని హిందీలో పోస్టర్‌పై రాసి ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల పోస్టర్‌కు కౌంటర్‌గా పాట్నలోని బీజేపీ కార్యాలయం వెలుపల పోస్టర్ వెలిసింది. ప్రతిపక్షాల ఐక్యతను హేళన చేస్తూ బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేతలంతా 'ఎటువంటి దార్శనికత లేకుండా' కలిసి వస్తున్నారని, పదవికోసం ఆరాటపడుతున్నారని పోస్టర్‌లో బీజేపీ ఎగతాళి చేసింది. పాట్నలో జరిగిన విపక్ష నేతల సమావేశాన్ని దిక్కుమాలినదిగా బీజీపీ అభివర్ణించడం గమనార్హం.