LOADING...
Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్‌ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్‌ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యూచర్‌ సిటీ' నిర్మాణానికి పూనుకుంది. హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంలో సుమారు 765 చ.కి.మీ. విస్తీర్ణంలో ఈ అతి పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా 'భవిష్య నగర అభివృద్ధి సంస్థ(FCDA)'ను ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ అర్బన్‌ ఏరియాస్‌ (డెవలప్‌మెంట్‌) యాక్ట్‌-1975 పరిధిలో పనిచేయనుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ హద్దులకు బయటగా ఏర్పడుతున్న ఈ స్మార్ట్‌ జోన్‌ భావితరాలకు స్థిరమైన, సమగ్ర నగరంగా మారడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి ఈ నగర నిర్మాణంలో ప్రధాన సూత్రాలుగా ఉంటాయి. విద్య,ఆరోగ్యం,ఉపాధి, వినోదం..అన్ని ఒకే ప్రాంతంలో,నడకదూరంలో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

వివరాలు 

వ్యూహాత్మక ఏర్పాటు 

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా రూపొందిన మాస్టర్‌ ప్లాన్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఈప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో సమీక్షించి ఆయన సూచనలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే పూర్తి ప్రణాళికను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. 'ఫ్యూచర్‌ సిటీ' స్థల నిర్మాణం ఔటర్‌ రింగ్‌ రోడ్‌, శ్రీశైలం హైవే,నాగార్జునసాగర్‌ హైవేలకు సమీపంలో ఉంటుంది. ఇది రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో వ్యూహాత్మకంగా కీలకం. విస్తారమైన భూభాగం,ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సంస్థలు ఈ ప్రాంతాన్ని భవిష్యత్‌లో తెలంగాణ ఆర్థిక బలానికి కేంద్రంగా నిలబెడతాయని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌పై పెరుగుతున్న జనసంచారం,మౌలిక వసతుల ఒత్తిడిని తగ్గించడం,స్మార్ట్‌ సౌకర్యాలు, సుస్థిర జీవనం,వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

వివరాలు 

పర్యావరణ స్థిరత్వం.. జీవావరణ సంరక్షణ 

ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌) తీసుకుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన కన్సల్టెన్సీ సంస్థ సహాయంతో మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన వేగంగా కొనసాగుతోంది. ఈ నగర నిర్మాణంలో పర్యావరణ స్థిరత్వం కీలకం. పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వ కోసం స్పాంజ్‌ పార్కులు ఏర్పాటవుతాయి. ఇవి వర్షపు నీటిని గ్రహించి వరదలను అడ్డుకుంటాయి. నీటి కొరత నివారణకు పునర్వినియోగ నీటి వ్యవస్థను అమలు చేస్తారు. జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ విధానంతో బయట నుంచి నీటి సరఫరాపై ఆధారపడకుండా పరిష్కారాన్ని అందిస్తారు. విద్యుత్‌ అవసరాల కోసం అధిక సామర్థ్య సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. పారిశ్రామిక జోన్‌లు, కమర్షియల్‌ ఏరియాల మధ్య గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తారు.

వివరాలు 

పర్యావరణ స్థిరత్వం.. జీవావరణ సంరక్షణ 

పెద్ద ఎత్తున నగర అటవీ, పాకెట్‌ పార్కుల నెట్‌వర్క్‌ హరిత వాతావరణాన్ని పెంచుతుంది. నివాస సముదాయాలు వాక్‌-టు-వర్క్‌ మోడల్‌లో రూపకల్పన అవుతాయి. సమీప రిజర్వ్‌ అటవీ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు, ఇప్పటికే ఉన్న నీటి వనరులు, జంతు ప్రదర్శనశాల, ఎకో-టూరిజం జోన్‌లను సంరక్షిస్తారు. ఫ్యూచర్‌ సిటీ సరిహద్దు వెంట హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకాన్ని, బిజినెస్‌ ట్రావెల్‌ను ప్రోత్సహిస్తారు. అదనంగా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఈ-వేస్ట్‌ డిస్పోజల్‌, కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పడి, అన్ని రకాల వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుంది.

వివరాలు 

ప్రత్యేక ఎకోసిస్టమ్‌ జోన్‌లు 

కృత్రిమ మేధస్సు, జీవశాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి ఎలక్ట్రిక్‌ వాహనాలు, పవర్‌ స్టోరేజీ పర్యాటకం, వినోదం, చలనచిత్ర నిర్మాణం ఆరోగ్యం, విజ్ఞాన మౌలిక సదుపాయాలు

వివరాలు 

ప్రధాన ప్రత్యేకతలు 

భారతదేశంలో తొలి నెట్‌-జీరో స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ సిటీ: విద్యుత్‌ నిల్వ వ్యవస్థలు, నీటి పునర్వినియోగం, విస్తారమైన హరిత వనాలు. లివ్‌, లెర్న్‌, వర్క్‌, ప్లే మోడల్‌: విద్య, ఉపాధి, వినోదం, నివాసాలు.. అన్ని ఒకే ప్రదేశంలో, స్వయం-సమృద్ధ నగర వ్యవస్థ. జాతీయ ప్రదర్శన ప్రాజెక్ట్‌: భవిష్యత్‌ భారత నగరాలకు ఆదర్శంగా నిలిచే నమూనా నగరం. క్లస్టర్‌ ఆధారిత అభివృద్ధి: పారిశ్రామిక, విద్య, ఆరోగ్యం, పర్యాటక జోన్‌లను ట్రాన్సిట్‌ కారిడార్‌లు, లాజిస్టిక్స్‌ హబ్‌లతో అనుసంధానం. డిజిటల్‌-ఫస్ట్‌ ప్లానింగ్‌: జీఐఎస్, రియల్‌-టైమ్‌ డ్యాష్‌బోర్డ్‌లు, బిల్డ్‌నౌ వంటి వ్యవస్థల వినియోగంతో పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తారు. గ్లోబల్‌ ఎలైన్‌మెంట్‌: జికా, వరల్డ్‌ బ్యాంక్‌, AIIB వంటి అంతర్జాతీయ నిధులను ఆకర్షించేలా ప్రాజెక్టులు రూపొందించడం.

వివరాలు 

రహదారి ప్రణాళిక 

గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌ (రేడియల్‌ రోడ్‌ నం.1): ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద రావిర్యాల (టాటా ఇంటర్‌చేంజ్‌) నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వద్ద ఆమనగల్లు వరకు విస్తరిస్తుంది. ఇది ఫ్యూచర్‌ సిటీ పరిధిలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లను కలుపుతూ, SH-19, NH-765 రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తం పొడవు: 41.5 కి.మీ. దశ-1: రావిర్యాల ఓఆర్‌ఆర్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌ వరకు - 19.2 కి.మీ. దశ-2: మీర్‌ఖాన్‌పేట్‌ నుంచి ఆమనగల్లు (RRR) వరకు - 22.3 కి.మీ.