Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మూడోసారి వరుసగా కాంగ్రెస్‌కు జీరో సీట్లు రావడం గమనార్హం. తాజాగా ఈ ఎన్నికల ఫలితాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
దిల్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి ఆప్, కాంగ్రెస్ రెండు పార్టీలు సమానంగా బాధ్యత వహించాలని సూచించారు.
"మనమంతా ఇండియా కూటమిలో భాగస్వాములం. అందులో కాంగ్రెస్ సీనియర్ భాగస్వామి. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైనా, ఆప్‌పైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Details
ఇండియా కూటమిలో ఎవరికీ అహంకారం ఉండకూడదు
ఇక ఎన్నికలకు ముందు చర్చ జరిపి, ఆప్-కాంగ్రెస్ కలసి పోటీ చేసి ఉంటే బీజేపీ గెలిచే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేశారు.
ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఇండియా కూటమిలో ఎవరికీ అహంకారం ఉండకూడదని, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్రను పోషించాలని ఆయన హితవు పలికారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కీలక నాయకులు ఓటమిపాలయ్యారు. అయితే అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.