Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది. ఈ ప్యానెల్‌లో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి కూడా స్థానం కల్పించారు. కమిటీలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ ఒక్కరే కావడం గమనార్హం. అయితే తాజాగా అధీర్ రంజన్ చౌదరి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. ఈ కమిటీని ఒక కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. తాను కమిటీతో కలిసి పనిచేయాడానికి సిద్ధంగా లేనంటూ కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.
ఇదొక ప్రభుత్వ ఎత్తుగడ: అధీర్
ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అనేది రాజ్యాంగపరంగా అనుమానించదగిన, ఆచరణాత్మకంగా సాధ్యం కాని, లాజికల్‌గా అమలు చేయలేని ఆలోచనగా అధీర్ రంజన్ చౌదరి అభివర్ణించారు. 2024సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు ఈ ప్రణాళికను అమలు చేయడానికి వెనుక ప్రభుత్వం ఎత్తుగడ ఉందని ఆయన అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను కమిటీలో సభ్యుడిగా చేర్చకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. కోవింద్, అమిత్ షా, చౌదరితో పాటు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలు ప్రభుత్వ ప్రతిపాదిత కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికలపై చర్చ
సెప్టెంబర్ 18నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో జమిలి ఎన్నికలు(one nation, one election) నిర్వహించే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. సెషన్‌లో ప్రైవేట్ సభ్యుల నోటీసులలపై కూడా ఎలాంటి చర్చలు ఉండవని ఉభయ సభల సెక్రటేరియట్‌లు శనివారం వెల్లడించాయి. ఇదిలా ఉంటే, 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశం అమలుకు చర్యలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2019లో మోదీ రెండోసారి గెలిచిన తర్వాత జమిలి ఎన్నికల ఆలోచనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. అప్పట్లో కూడా ఈ ఆలోచన సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పలు ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించాయి.