
Air India crash: రతన్ టాటా ఉండి ఉంటే.. పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగిన మూడు నెలలు గడిచినా పరిహారం అందకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 65 మంది బాధిత కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఈ ఆలస్యాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఈ పరిస్థితిలో ఉంటే పరిహారం విషయంలో ఇంత కాలం ఆలస్యం జరిగేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే రతన్ టాటా
రతన్ టాటా ఎప్పుడూ ఇతరుల పట్ల కరుణతో వ్యవహరిస్తారని, ఆయన ఈ రోజుల్లో బాధిత కుటుంబాలు పడుతున్న మానసిక వేదనను తప్పక గుర్తించేవారని ఆండ్రూస్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే రతన్ టాటా ఉంటే, ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే సహాయం అందించేవారని ఆయన అన్నారు. ఉదాహరణగా, ఓ మృతుడి తల్లి పరిస్థితిని వివరించారు. తనను చూసుకునే ఏకైక కుమారుడిని కోల్పోవడంతో ఆ మహిళ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా తీవ్ర కష్టాల్లో ఉందని, ఇప్పుడు ఆమె అవసరాలు ఎవరు తీర్చుతారని ప్రశ్నించారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యి కొద్దిసేపటికే కుప్పకూలిన విషాదం తెలిసిందే.
వివరాలు
పరిహారంపై బాధిత కుటుంబాలు ఆవేదన
విమానంలో ఉన్న 242 మందిలో ఒకరిని మినహా మిగతా అందరూ మృతి చెందారు. ఈ ఘటన అనంతరం టాటా సన్స్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున పరిహారం, అలాగే తక్షణ అవసరాల కోసం రూ. 25 లక్షల మధ్యంతర సాయం అందజేస్తామని ప్రకటించింది. అయితే, ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచినా ఈ నిధులు అందలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాక, పరిహారం ఇచ్చే ముందు ఆర్థిక వివరాలు సమర్పించాలని ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ, మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించుకోవడానికే ప్రశ్నావళి పంపించామని, పరిహారం చెల్లింపుకు సంబంధించి కొన్ని విధివిధానాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.