AP Govt: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా.. సిద్ధమైన ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఈ ప్రతిపాదనలపై త్వరలో ఉన్నతస్థాయిలో సమావేశం నిర్వహించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ దిశగా, శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్‌గా, గుంటూరు నుండి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా విభజించి టెండర్ పిలిచేలా నిర్ణయించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి రూ.25 లక్షల విలువైన ఉచిత చికిత్స అందిస్తున్నారు.
కానీ కొత్త బీమా విధానంలో ఏవైనా పరిమితులు లేకుండా, ప్రజలందరికీ పూర్తిగా ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు టెండర్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు.
వివరాలు
'హైబ్రిడ్' విధానం
ప్రస్తుత రూ.25 లక్షల వార్షిక పరిమితి అలాగే కొనసాగుతుందేమోగానీ,ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించేలా టెండర్ పిలవనున్నారు.
ఈ మొత్తాన్ని మించిన చికిత్స ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. దీనిని 'హైబ్రిడ్' విధానంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏడాదికి రూ.2.5 లక్షల లోపు ఖర్చయ్యే వైద్య సేవలు పొందే వారు రాష్ట్రంలోని 97% మంది అని అంచనా.
ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం తీసుకున్న అనంతరం, వచ్చే ఏప్రిల్ లేదా మే నాటికి కొత్త బీమా విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా అమలుపై కీలకంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపి, అవసరమైన మార్పులు చేయనున్నారు.
వివరాలు
బీమా వర్తింపుకు కొత్త మార్గదర్శకాలు
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు మినహా, ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న 1.43 కోట్ల కుటుంబాలకు ట్రస్టు ద్వారా ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు బీమా ప్రీమియం చెల్లిస్తూ వైద్య సేవలు పొందుతున్నారు.
ప్రస్తుతం ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ వార్షికంగా సుమారు రూ.7,000 వరకు చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ప్రీమియం చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లను మినహాయించి మిగతా రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
టెండర్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
నిర్దేశించిన రెండు యూనిట్లకు ఒకే టెండర్ పిలవనున్నారు.
తక్కువ ధరను కోట్ చేసిన ప్రైవేట్ కంపెనీ (L1) గెలిస్తే, అదే ధరకు సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు.
ప్రభుత్వ రంగ సంస్థ అంగీకరించితే, మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు.
ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థే L1గా వస్తే, రెండు యూనిట్లను అదే నిర్వహించేలా బాధ్యత అప్పగిస్తారు.
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆరోగ్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
వివరాలు
చెల్లింపుల విధానం & చికిత్స
ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా రోగికి చికిత్సకు అనుమతి పొందేందుకు 24 గంటల సమయం పడుతోంది.
కొత్త బీమా విధానంలో 6 గంటల్లో అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటారు.
బీమా కంపెనీ చికిత్స మంజూరు నిరాకరిస్తే, వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు.
ఎంపికైన బీమా కంపెనీ కనీసం 3 ఏళ్లపాటు సేవలు అందించాలి. ప్రతి ఏడాది పనితీరు సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులు అలాగే కొనసాగుతాయి. వైద్య మిత్ర సేవలు కూడా కొనసాగిస్తారు.
వివరాలు
చెల్లింపుల పారదర్శకత
ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వపరంగా ముందుగానే బీమా సంస్థలకు చెల్లింపులు చేయనున్నారు.
దీని వల్ల బిల్లుల చెల్లింపు సమస్యలు తొలగిపోతాయి. రోగులకు అందించిన చికిత్స వివరాలు బీమా కంపెనీలకు అందిన వెంటనే నిర్దేశిత గడువులోపు చెల్లింపులు చేయాలని టెండర్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు.
ప్రస్తుతం 30 రకాల స్పెషాల్టీలతో కలిపి 3,257 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
వీటిని అలాగే కొనసాగించనున్నారు. పీఎంజేఏవై (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) కింద అందుతున్న 1,949 రకాల వైద్య సేవలు కూడా ఇందులో ఉంటాయి.
వివరాలు
ప్రీమియం & వ్యయ నియంత్రణ
ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం సుమారు రూ.2,500 వరకు ఉండొచ్చని అంచనా.
జాతీయ స్థాయిలో నిర్వహించే టెండర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి.
ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, తమిళనాడు, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను విశ్లేషించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయన నివేదికల ఆధారంగా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.